Share News

Panchayat Elections: డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికకుఆమోదం

ABN , Publish Date - Nov 21 , 2025 | 05:10 AM

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్‌ కమిషన్‌ అలా నివేదిక సమర్పించగానే.. ఇలా మంత్రులందరికీ పంపి ఆమోదం కోసం సంతకాలు కూడా తీసేసుకుంది.....

Panchayat Elections: డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికకుఆమోదం

  • అనంతరం జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు

  • పంచాయతీ ఎన్నికలకు 26న షెడ్యూల్‌?.. ఆ వెంటనే నోటిఫికేషన్‌ జారీ

  • ఎన్నికల ప్రక్రియపై ఎస్‌ఈసీ, సీఎస్‌, డీజీపీ వీడియో కాన్ఫరెన్సు

  • క్షేత్రస్థాయి సన్నద్ధతపై జిల్లాల అధికారులతో పూర్తయిన సమీక్ష

  • మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ: డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్‌ కమిషన్‌ అలా నివేదిక సమర్పించగానే.. ఇలా మంత్రులందరికీ పంపి ఆమోదం కోసం సంతకాలు కూడా తీసేసుకుంది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ జారీ చేయడంతోపాటు అవసరమైతే.. ఒక్కరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్‌ కూడా ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. డిసెంబర్‌ 15లోపు మొత్తం అన్ని దశల ఎన్నికలూ పూర్తి చేయాలనే ఆలోచనతో ఉంది. ఒకవేళ ప్రభుత్వం రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. ఒక్కో దశ ఎన్నికకూ మధ్య కనీసం రెండు రోజులు సమయం ఉండేలా

నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను పాత పద్ధతి ప్రకారం (50 శాతానికి లోబడి ఉండేలా) ఖరారు చేసి ఇవ్వాలని ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోరిన మేరకు.. బూసాని వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలోని డెడికేటెడ్‌ కమిషన్‌ గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి మళ్లీ మంత్రివర్గ ఆమోదం అవసరం. అయితే మళ్లీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 25న ఉంది. కానీ.. అప్పటిదాకా కూడా ఆగకుండా.. వెంటనే మంత్రులందరికీ ఆ నివేదికను పంపి సంతకాలు సేకరించి ఆమోదముద్ర తీసేసుకుంది. సాధ్యమైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశమే దీనికి కారణం. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు త్వరగా వచ్చేలా చేసేందుకే ప్రభుత్వం ఇలా వేగంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఆర్థిక సంఘం కాలపరిమితి మార్చి వరకూ ఉన్నా.. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి, కొత్త పాలకవర్గాలు కొలువుదీరి, కేంద్రానికి పెండింగ్‌ నిధుల విడుదల కోసం లేఖలు రాసి, అవి వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీలైనంత తొందరగా ఎన్నికలకు వెళ్లనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకోసం డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం శుక్ర, శనివారాల్లోనే రిజర్వేషన్ల విధివిధానాలపై మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీచేయనుంది. వాటి ఆధారంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగాలు జిల్లాల జనాభాకు, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నాయి.


ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఈ ప్రక్రియను రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సంబంధిత విభాగాలు సమాయత్తమవుతున్నాయి. సర్కారు వేగానికి దీటుగా.. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఓటరు జాబితా సవరణపై దృష్టి పెట్టిన ఎస్‌ఈసీ.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతోపాటు జిల్లాలవారీగా కలెక్టర్లు, డీపీవోలతో గురువారం వీడియోకాన్ఫరెన్సు(వీసీ) నిర్వహించింది. జిల్లాలవారీగా ఎన్నికల సంసిద్ధతను ఎస్‌ఈసీ రాణికుముదిని ఈ సందర్భంగా సమీక్షించారు. తుది ఓటరు జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది, పోలింగ్‌ సామగ్రి, శాంతిభద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, మోడల్‌ కోడ్‌ కమిటీ, ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపై సమీక్షించారు. కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రస్థాయి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

మూడుదశల్లో ఎన్నికల నిర్వహణ: డీజీపీ

ఎన్నికల నిర్వహణలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికలను మూడుదశల్లో నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రతిపాదించారు. ఒకచోట ఎన్నికలు పూర్తయ్యాక మరోచోట ఎన్నికల నిర్వహణకు రెండు రోజుల విరామం ఉండాలని పేర్కొన్నారు. దీనివల్ల పోలింగ్‌ సిబ్బందికి, భద్రతా బలగాలకు తగిన సమయం లభిస్తుందని, బందోబస్తు నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టగలరని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 05:10 AM