Andessri Passes Away: మాయమైపోయిండు..
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:09 AM
ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సృజించిన అందెశ్రీ (64) ఇకలేరు. హైదరాబాద్ లాలాపేటలోని తన నివాసంలో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు.....
హైదరాబాద్, తార్నాక, ఘట్‌కేసర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సృజించిన అందెశ్రీ (64) ఇకలేరు. హైదరాబాద్ లాలాపేటలోని తన నివాసంలో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఇంట్లోనే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోలీసు గౌరవ వందనంతో అంత్యక్రియలు జరుగుతాయని, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దాంతో, ఆయన అంత్యక్రియలను మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఔటర్ జంక్షన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అరెకరం వివాదాల్లేని ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రెవెన్యూ అధికారులు అంకుషాపూర్, ఎన్‌ఎ్‌ఫసీనగర్, కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. చివరకు, ఘట్‌కేసర్‌లోని ఔటర్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీప స్థలాన్ని ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి స్థలాన్ని పరిశీలించి పనులు చేపట్టాలని ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. తొలుత, లాలాపేటలోని ఆయన ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఘట్‌కేసర్ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఆయన ఇంటి వద్ద కొద్దిసేపు ఉంచుతారు. అక్కడి నుంచి ర్యాలీగా యంనంపేట్ చౌరస్తాలోని ఔటర్ జంక్షన్‌కు చేరుకుని అక్కడ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అందెశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయన పార్థివ దేహానికి సీఎం నివాళులర్పిస్తారు. ఆ స్థలాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు.
తరలివచ్చిన నాయకులు, ప్రముఖులు
అందెశ్రీ మరణ వార్తతో తెలంగాణ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. మట్టి మనిషి, పల్లెపదాల భావోద్వేగి ఇకలేరన్న వార్త తెలుసుకుని సాహితీప్రియులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అందెశ్రీ ఆకస్మిక మృతితో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అభిమానుల సందర్శనార్థం అధికారులు సోమవారం మధ్యాహ్నం లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో అందెశ్రీ పార్థివ దేహాన్ని ఉంచారు. పెద్దఎత్తున రాజకీయ నాయకులు, అభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు తరలి వచ్చారు. అందెశ్రీ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్, పద్మారావుగౌడ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వెన్నెల గద్దర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యే మందుల సామేలు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కోదండరాం, కల్వకుంట్ల కవిత, సీతారాంనాయక్, వి.హనుమంతరావు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, సీపీ సజ్జనార్, తదితరులు ఉన్నారు. అందెశ్రీ అందించిన సేవలను కొనియాడారు. అందెశ్రీతో తమకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇంటి కల పూర్తిగా నెరవేరకుండానే..
అందెశ్రీ తనకు సొంత స్థలం ఉండాలని భావించారు. తాను చనిపోతే అందులోనే పూడ్చిపెట్టాలని చెబుతుండేవారు. ఇందుకు తన సొంతూరులో స్థలం కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, వివాదంతో అది సాధ్యపడలేదు. ఇందుకు ఆయన బాధ పడేవారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇక, ప్లాట్ కొనుగోలుకు కొద్ది కాలం కిందట ఆయన ఘట్‌కేసర్ పరిసరాల్లో తిరిగారు. పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లను సంప్రదించారు. రేటు విషయంలో వెనకడుగు వేశారు. ఇందులో భాగంగా ఎన్‌ఎ్‌ఫసీ నగర్ కాలనీలో తిరుగుగుండగా కొందరు ఉద్యమకారులు ఆయనను గుర్తుపట్టారు. వారు, అక్కడి రియల్టర్ల సహకారంతో 348 చదరపు గజాల ప్లాటు కొని 2023 మార్చిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మునిసిపాలిటీ అనుమతితో నాలుగంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్లాబులు పూర్తయి గోడల వరకు వచ్చింది.
అశ్రద్ధే ప్రాణాలు తీసిందా?
ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి అశ్రద్ధ చేయడమే అందెశ్రీ ప్రాణాలు తీసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆదివారం ఆయన ఘట్‌కేసర్ మునిసిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌లో నిర్మాణంలో ఉన్న తన ఇంటి వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఒంటిగంట వరకూ అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. వాచ్‌మన్ పిల్లలతో ముచ్చటించి వారికి కొన్ని డబ్బులిచ్చారు. సాధారణంగా జేబులో ఎన్ని డబ్బులుంటే అన్నీ ఆయన పిల్లలకు తీసి ఇస్తారని చెబుతున్నారు. అక్కడి నుంచి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో సమాచార శాఖ కమిషనర్ అయోధ్య రెడ్డి నిర్వహించిన అయ్యప్ప పడి పూజలో పాల్గొన్నారు. సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పుడే ఆయన తనకు ఒంట్లో బాగోలేదని, అలసటగా ఉందని, రెండు రోజులుగా కళ్లు తిరుగుతున్నాయని చెప్పినట్లు సన్నిహితులు వివరిస్తున్నారు. ఆయన తరచూ వెళ్లే హోమియో వైద్యుడి వద్దకు వెళ్లి మందులు తీసుకుని వాడినట్టు సమాచారం. అక్కడి నుంచి ఆయనను రాత్రి 7 గంటలకు ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌కు చెందిన వినయ్ అనే యువకుడు ఇంటి వద్ద దించినట్టు చెబుతున్నారు. సోమవారం ఉదయం ఆస్పత్రికి వెళ్దామని అనుకున్నారని, ఉదయం ఫోన్ చేస్తే ఆయన మృతి వార్త తెలిసిందని వినయ్ వాపోయాడు. కాగా, అందెశ్రీ హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారని, మందులు సరిగా వేసుకోలేదని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తెలిపారు. ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆయన చనిపోయారని తెలిపారు. ఆయన కొంత కాలంగా హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారని, రెండు నెలల నుంచి బీపీ మందులు సక్రమంగా వాడడం లేదని, కేవలం రెండు రోజుల నుంచే మందులు వేసుకుంటున్నారని వివరించారు. గుండెపోటుతో అందెశ్రీ మరణించారన్నారు.