CM Revanth Reddy: రాష్ట్రంలోనూ 69శాతం రిజర్వేషన్లు
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:34 AM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్ఫూర్తితో తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కరుణానిధి స్ఫూర్తితో అమలు
స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం , ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం
తమిళనాడు తరహాలో తెలంగాణలో ‘విద్యార్థులకు అల్పాహార పథకం’
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ కూడా..
చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన భారీ సభలో సీఎం రేవంత్
రేవంత్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ: స్టాలిన్
చెన్నై, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్ఫూర్తితో తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘విద్యార్థులకు అల్పాహార పథకం’ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోనూ అమలు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ‘విద్యలో తమిళనాడు అగ్రస్థానం’ పేరిట చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం గురువారం రాత్రి నిర్వహించిన భారీ సభకు సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కలిసి ‘తమిళ్ పుదల్వన్’, ‘పుదుమై పెన్’ పథకాల విస్తరణను లాంఛనంగా ప్రారంభించారు. ‘వణక్కం’ అంటూ ఈ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్.. ఈ కార్యక్రమానికి తనని ఆహ్వానించిన స్టాలిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కరుణానిధి ఆలోచనల్ని అమలు చేస్తున్న స్టాలిన్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ అమలు చేసిన పథకాలను దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అనుసరించారని గుర్తు చేసిన రేవంత్..
కామరాజర్ తమిళనాడులో అమలు చేసిన విద్యావిధానాన్ని యావద్దేశం అనుసరిస్తోందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం మొట్టమొదటిసారిగా తమిళనాడులోనే అమలు చేశారని, ఆ తర్వాతే దక్షిణభారతదేశంలోని రాష్ట్రాలు అనుసరించాయని పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘సీఎం అల్పాహార పథకం’ కార్యక్రమం తన హృదయాన్ని తాకిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోనూ ఆ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్లు
సామాజిక న్యాయం అమలులో తమిళనాడు-తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయన్న సీఎం రేవంత్.. కరుణానిధి స్ఫూర్తిగా తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42శాతం, ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కాగా, తమ ప్రభుత్వం విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని పీపీపీ విధానంలో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టాటా కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. తమిళనాడు-తెలంగాణ మధ్య సాంస్కృతిక, స్నేహ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నానని పేర్కొన్న సీఎం రేవంత్... తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీలో తమిళ విద్యార్థులు, కోచ్‌లకు కూడా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 56 అంగుళాల ఛాతీ(ప్రధాని మోదీ), కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏం ప్రయోజనం లేదన్న సీఎం రేవంత్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు సాధించి పెట్టే బాధ్యతను తెలంగాణ-తమిళనాడు తీసుకుంటాయని పేర్కొన్నారు. అనేక విద్యా సంస్థలు కలిగిన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు దేశానికి రోడ్ మ్యాప్ ఇవ్వనున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పోరాటాల ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని.. ఉద్యమ స్ఫూర్తితో, రాహుల్‌గాంధీ ప్రతినిధిగా సీఎం రేవంత్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంచారని స్టాలిన్ కొనియాడారు. తమిళనాట మహిళలకు అమలు చేస్తున్న ‘వెలుగుబాట పయనం’ లాగే తెలంగాణలో ‘మహాలక్ష్మి పథకం’ ద్వారా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఆ విధంగానే ఆ రాష్ట్రంలో అమలు చేసే మంచి పథకాలను తమిళనాట అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.