Lucky Draw Wins Big:లక్కీ డ్రాలో కిక్కే కిక్కు
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:22 AM
మద్యం దుకాణాల కేటాయింపులో సంగారెడ్డి జిల్లాలో సంచలనాలు నమోదయ్యాయి! జిల్లాకు చెందిన రాజేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి 24 షాపులకు టెండర్లు వేయగా..
సంగారెడ్డి జిల్లాలో ముగ్గురికి మూడేసి దుకాణాలు
సూర్యాపేటలో దంపతులకు చెరో షాపు
2601 షాపులకు లాటరీ పద్ధతిన కేటాయింపు పూర్తి
హైదరాబాద్, సంగారెడ్డి క్రైం, సూర్యాపేట (కలెక్టరేట్), అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల కేటాయింపులో సంగారెడ్డి జిల్లాలో సంచలనాలు నమోదయ్యాయి! జిల్లాకు చెందిన రాజేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి 24 షాపులకు టెండర్లు వేయగా.. లక్కీ డ్రాలో సంగారెడ్డి పట్టణంలోని 1, 3, 8 దుకాణాలు ఆయనకు దక్కాయి. పటాన్‌చెరుకు చెందిన వంశీధర్ రెడ్డి అనే వ్యక్తి వందకుపైగా దరఖాస్తులు వేసి మూడు దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు! జిల్లాకే చెందిన భూపతిరెడ్డి అనే మరో వ్యక్తికి కూడా లక్కీ డ్రాలో మూడు దుకాణాలు వచ్చాయి. మరోవైపు సూర్యాపేటలో ఎలికట్టి భరత్-శ్రావణి దంపతులకు లక్కీడ్రాలో రెండు దుకాణాలు దక్కాయి రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం షాపులకుగాను. 95,137 మంది దరఖాస్తు చేసుకోగా.. వాటిలో 2601 దుకాణాలను సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు లాటరీ పద్ధతిన కేటాయించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, వీడియో రికార్డింగ్‌తో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేసి డ్రా ప్రక్రియ నిర్వహించారు. మిగిలిన 19 దుకాణాలకూ తక్కువగా దరఖాస్తులు రావడంతో.. వాటి డ్రాను నిలిపివేశారు. వాటికి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వెంటనే దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. నవంబరు 1 వరకూ దరఖాస్తులను స్వీకరించి.. 3వ తేదీన డ్రా తీయనున్నారు. ఈ 19 దుకాణాల్లో.. అత్యధికంగా 7 షాపులు కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉండగా.. ఆదిలాబాద్‌లో 6, జయశంకర్ భూపాలపల్లి 2, శంషాబాద్‌లో 3 సంగారెడ్డిలో ఒక మద్యం షాపు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని మద్యం వ్యాపారులు కుమ్మక్కై తాము తప్ప మరెవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకోవడంతో ఈ దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. అక్కడ వ్యాపారులు సిండికేట్ అయ్యారని గ్రహించిన అధికారులు.. వారి ఎత్తుకు పైఎత్తువేసి.. ఆ దుకాణాలకు డ్రా నిలిపివేశారు! ఈ దుకాణాలకు మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ సంబంధిత జిల్లాల అధికారులను ఆదేశించారు.