448 More RTC Lease Buses: మహిళా సాధికారతకు మరింత ఊతం
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:22 AM
రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది..
మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సులు
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 152 ఆర్టీసీ అద్దె బస్సులను మండల మహిళా సమాఖ్యలు నిర్వహిస్తున్నాయి. మరో 448 అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకే అప్పగించే ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖ రాశారు. మండల మహిళా సమాఖ్యలు 448 బస్సుల కొనుగోలు పూర్తిచేసి, వాటిని ఆర్టీసీకిఅద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అవసరమైన అనుమతులు మంజూరైన వెంటనే ఆ బస్సులను ఆర్టీసీకి అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో బస్సు ద్వారా మహిళా సంఘాలకు నెలకు సుమారు రూ.70 వేల వరకు అద్దె ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న 152 బస్సుల నిర్వహణ విజయవంతమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మిగతా 448 బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రకటించారు భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసి, ఎక్కువ సంఖ్యలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పలు పథకాల అమలు
ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళలు బస్సు టిక్కెట్ చార్జీల రూపంలో రూ. 7,600 కోట్లు ఆదా చేసుకున్నారు. సబ్సిడీపై రూ. 500కు గ్యాస్ సిలెండర్‌తో 45 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మహిళలు సొంతంగా ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇవ్వడంతోపాటు పెట్రోల్ బంకులను నిర్వహించేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 26 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. కొత్తగా 2,25,110 సంఘాలు రూ.4,825.54 కోట్ల విలువైన వ్యాపారాలను ప్రారంభించాయి. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.