Share News

Tummala Nageshwar Rao: తెలంగాణకు మరో 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:06 AM

దేశ వ్యాప్తంగా యూరియా కొరత రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుల యూరియా కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది...

Tummala Nageshwar Rao: తెలంగాణకు మరో 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

  • ఎరువులు, రసాయనాల శాఖ ఆదేశాలు

  • ఈ నెలలోనే రాష్ట్రానికి లక్షా 4 వేల టన్నులు

  • రెండోసారి ఢిల్లీకి మంత్రి తుమ్మల

  • జూలైలోనే నడ్డాకు సీఎం రేవంత్‌ వినతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా యూరియా కొరత రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుల యూరియా కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితి ముందే గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జూలై 8నే ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 3న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి యూరియా కొరత తీర్చాలని కోరారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు కేంద్రమంత్రులను కలిసి సమస్యను విన్నవించారు. సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఢిల్లీకి వచ్చారు. కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌ మిశ్రాని కలిసి రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియాను తక్షణమే కేటాయించాలని కోరారు. దేశీయంగా యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని, ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో తెలంగాణకు తగు ప్రాధాన్యం ఇస్తామని రజత్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. వెంటనే 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని తెలిపారు. ఈ పది, పదిహేను రోజులు అత్యంత కీలకమని, అందుకే.. తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కోరినట్టు చెప్పారు. అలాగే అంతకు ముందు నెలల్లో ఏర్పడిన లోటును పూడ్చేవిధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కావాలని కోరామని అన్నారు. సెప్టెంబరు నెలలో ఇప్పటి వరకు లక్షా 4 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా చేశారన్నారు. రానున్న 10 రోజుల్లో మరో లక్ష మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా, దేశీయంగా యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో 40 వేల మెట్రిక్‌ టన్నులు తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలిచ్చారని తెలిపారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారంలో సరఫరా అయ్యే 40 వేల మెట్రిక్‌ టన్నులకు ఇది అదనమని చెప్పారు.

Updated Date - Sep 16 , 2025 | 05:06 AM