Deputy CM Bhatti Vikramarka: శాస్త్రీయ అధ్యయనాల హబ్‌గా రాష్ట్రం
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:50 AM
రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనాలకు కేంద్రీకృత హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు....
న్యూమిస్మాటిక్స్‌లో రాష్ట్రం అగ్ర స్థానంలో నిలవాలి
‘నాణేలు, దక్షిణాది ఆర్థిక వ్యవస్థ’పై సదస్సులో భట్టి
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనాలకు కేంద్రీకృత హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. న్యూమిస్మాటిక్స్(నాణేల శాస్త్రం) అధ్యయనం, వారసత్వ పరిరక్షణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో న్యూమిస్మాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం ‘దక్షిణ భారత దేఽశంలో నాణేలు, ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో వారసత్వ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా... కాకతీయుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు నాణేల ఆవిష్కరణలు కొనసాగాయని చెప్పారు. నాణేలు అంటే లోహపు ముక్కలు కావనీ.. అవి ఆ కాలపునాటి పన్ను వ్యవస్థలు, ముద్రణ, సాంకేతికత, రాజకీయ దృక్పథాన్ని వివరిస్తాయని అన్నారు. వారసత్వ(పురావస్తు) శాఖ తన 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు. సమావేశంలో రాష్ట్ర వారసత్వ విభాగం డైరెక్టర్ అర్జున్‌రావు, న్యూమిస్మాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ డా. డి.రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.