Telangana Rising 2047: ఆనాటికి లైఫ్ అదరహో!
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:54 AM
రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయా? వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయా? 2047కి ఆధునిక సౌకర్యాలు....
2047నాటికి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగు
రూ.24 లక్షలకు తలసరి ఆదాయం
హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆధునిక సౌకర్యాలు
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలకు ‘స్మార్ట్ కారిడార్లు’
డిజిటల్ గవర్నెన్స్‌తో పంపిణీ వ్యవస్థ
‘తెలంగాణ రైజింగ్-2027’ విజన్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం భరోసా
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయా? వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయా? 2047కి ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య, విద్యా వసతులు అందుబాటులోకి రానున్నాయా? అంటే... అవుననే అంటోంది ‘తెలంగాణ రైజింగ్- 2047’ దార్శనిక పత్రం. 2047 నాటికి ప్రజా జీవన విధానం మారిపోనుందని, నగరాలు, పట్టణాలు, పల్లెలను అత్యంత నివాస యోగ్యంగా మార్చి నాణ్యమైన జీవనాన్ని అందిస్తామని చెబుతోంది. ముఖ్యంగా అత్యంత ప్రతిభావంతులు, సంస్థలను ఆహ్వానించడం, హైదరాబాద్‌ను శక్తివంతమైన ద్వితీయ శ్రేణి నగరాలతో అనుసంధానించడం, ప్రజలు సౌకర్యవంతంగా నివసించడానికి అనువైన పచ్చదనాన్ని పెంపొందించడం కల్పించడం వంటి చర్యల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఈ నెల 9న ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించింది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తామని డాక్యుమెంట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో ప్రజల తలసరి ఆదాయాన్ని ప్రస్తుతమున్నదాని కంటే 6.2 రెట్లు పెంచి రూ.24 లక్షలకు చేరుస్తామని ప్రకటించింది. ఇంత భారీ స్థాయిలో తలసరి ఆదాయం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని, తద్వారా అన్ని రకాల జీవన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే 2047 నాటికి తెలంగాణ ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయని స్పష్టం చేస్తోంది.
జీవన ప్రమాణాల పెరుగుదలకు తీసుకునే చర్యలు
ప్రతిభే పెట్టుబడి: దేశ, విదేశీ ప్రతిభావంతులు, సంస్థలను ఆకర్షించడానికి రాష్ట్రంలోని నగరాలను అత్యంత సురక్షితమైన, పచ్చదనంతో కూడిన, సాంస్కృతిక చలనశీలత్వం గల ప్రాంతాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. ఆవిష్కరణలకు హైదరాబాద్ ముఖద్వారంగా పనిచేయనుంది. ఇది పోటీతత్వంతో కూడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది.
స్మార్ట్ పౌర సదుపాయాలు: ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, అవాంతరాలు లేని రవాణా సౌకర్యాలు కల్పించనుంది. స్మార్ట్ పౌర సదుపాయాలు కల్పిస్తూ, పచ్చదనాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌లాంటి జీవన ప్రమాణాలను రాష్ట్రంలోని ఇతర ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనుంది.
నైట్ ఎకానమీ: పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహార పదార్థాల విక్రయాలు, వినోదం వంటి వాటిని అనుమతించనుంది. తద్వారా కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. పర్యాటకాన్ని పెంచనుంది.
ఒకేచోట సేవలు: రాష్ట్రంలో మిశ్రమ వినియోగ సమూహాల కాన్సె్‌ప్టను అభివృద్ధి చేయనుంది. అంటే పలు రకాల సేవలు ఒకేచోట లభించేలా చర్యలు తీసుకోనుంది. తద్వారా వృత్తిదారులకు రవాణా సమయం తగ్గుతుంది. ఇది ఉత్పాదకత పెరుగుదల, సామాజిక ఐక్యత, ప్రజా సంక్షేమానికి దోహదపడుతుంది.
పచ్చదనం, సమ్మిళిత వృద్ధి: ‘నెట్ జీరో’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నగరాన్ని కర్బన ఉద్గారాల రహిత ప్రాంతంగా మార్చనుంది. సురక్షితమైన రవాణా సౌకర్యాలు, పచ్చదనాన్ని అందుబాటులోకి తెస్తూ క్లీన్ ఎనర్జీని, పునర్వినియోగ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఈ విధానం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
స్మార్ట్ అర్బన్ కారిడార్లు: సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం, వివిధ రకాల సేవలను మెరుగుపర్చడం, ఆర్థిక పరిస్థితులను పటిష్ఠపర్చడం ద్వారా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించనుంది.
డిజిటల్ గవర్నెన్స్‌తో..: ప్రజా సంక్షేమ ప్రాధమ్య నగరాలను అభివృద్ధి చేయనుంది. బాధ్యతాయుతమైన పంపిణీ వ్యవస్థ, స్పష్టమైన ప్రమాణాల అమలు, కచ్చితత్వ ఫలితాల ద్వారా డిజిటల్ గవర్నెన్స్ తీసుకురానుంది. సమర్థమైన రవాణా వ్యవస్థ, పచ్చదనాన్ని అభివృద్ధి చేయనుంది.