Telangana Rising Vision: 2047 నాటికి.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:52 AM
రెండేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది...
జీడీపీకి రాష్ట్రం నుంచి 10ు వాటా.. తలసరి ఆదాయం రెట్టింపే లక్ష్యం
రాష్ట్రం 3 ప్రాంతాలుగా సుస్థిరాభివృద్ధి.. ‘తెలంగాణ రైజింగ్-2047’ డాక్యుమెంట్
వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరణ
ఏం చేయబోతున్నామో చెప్పేదే ‘తెలంగాణ రైజింగ్’ డాక్యుమెంట్
గ్లోబల్ సమ్మిట్ నాటికి రూపకల్పన పూర్తి చేయాలి: సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ దిశగా ఏయే రంగాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించాలి? ఏయే వర్గాలకు ఎలాంటి అవకాశాలు, సదుపాయాలు కల్పించాలనే అంశాలతో ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరిట ఒక డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ఈ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనుంది. రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని.. ప్రస్తుతమున్న 210 బిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం తన విజన్ డాక్యుమెంట్‌లో వెల్లడించింది. అప్పటికల్లా ‘జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)’కి రాష్ట్రం నుంచి 10 శాతం వాటా అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పది రెట్ల మేర పెంచడమే తన సంకల్పమని ప్రకటించింది. ఇలాంటి వృద్ధిని సాధించడానికి ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తామని తెలిపింది. ఆ డాక్యుమెంట్‌లోని ముఖ్యాంశాలు..
మూడు ప్రాంతాలుగా అభివృద్ధి
రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి, సమాన అభివృద్ధిని సాధించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అర్బన్ కోర్, పెరి అర్బన్, గ్రామీణ తెలంగాణగా వర్గీకరించి, దీర్ఘకాలిక లక్ష్యంతో అభివృద్ధిని సాధిస్తామని తెలిపింది. అర్బన్ కోర్ ఏరియాలో భాగంగా హైదరాబాద్, ఇతర ప్రధాన నగర నోడ్‌లను టెక్నాలజీ, ఇన్నోవేషన్స్, అత్యాధునిక తయారీ, పరిశ్రమలు-4.0, జీసీసీలు, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌లుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. పెరి అర్బన్ ఏరియాలో భాగంగా మధ్య తరహా తయారీ పరిశ్రమలు, ఆరెంజ్, ఎల్లో పరిశ్రమలు, ఎంఎ్‌సఎంఈ, లాజిస్టిక్ హబ్స్ ఏర్పాటు చేసి ఆర్థిక సమగ్రతను సాధించనున్నారు. గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో సుస్థిర జీవనోపాధి అవకాశాలను పెంచుతారు. ముఖ్యంగా సాంకేతిక వ్యవసాయం, పశు సంపద, అటవీ ఆధారిత ఉపాధి, హస్త కళాఖండాల తయారీ వంటి సంప్రదాయ పరిశ్రమల ద్వారా ఈ అభివృద్ధిని సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను అభివృద్ధి చేసి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే.. తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రపంచ హబ్‌గా మార్చాలని, తయారీ, అన్వేషణలు, నాలెడ్జ్ ఇండస్ట్రీ్‌సకు గమ్యస్థానంగా మార్చాలని.. సెమీకండక్టర్ సిటీ, ఎనర్జీ పార్కు, ఎలకా్ట్రనిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మహిళా శక్తే దేశ శక్తి...
మహిళలు శక్తిమంతులైతేనే దేశం శక్తిమంతంగా మారుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. ‘ఇందిరా మహిళా శక్తి మిషన్’లో భాగంగా రాష్ట్రంలోని హహిళలను 2047 నాటికి ప్రధాన శక్తిగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలను 2047 నాటికి కోటీశ్వరుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు ప్రతి రంగంలో, ప్రతి స్థాయిలో సహకరించనుంది. ఎంఎ్‌సఎంఈ పార్కులు, స్వయం సహాయక గ్రూపులు, ఇన్నోవేషన్ హబ్‌లలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భాగస్వామ్యం కల్పించనుంది.
యవతకు ఊతం
ప్రస్తుతం రాష్ట్రంలో 35 ఏళ్ల లోపు యువత 65 శాతం వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరికి నాణ్యమైన విద్యను అందించడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతను పెంపొందించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలు చేపట్టనుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. అడ్వాన్స్ మానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో వారికి అవకాశాలు కల్పించనుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్లు, జీఐఎస్ మ్యాపింగ్ ఆధారిత ఆర్థిక జోన్లలో యువతకు అవకాశం కల్పించడం, విద్య, కీడ్రలకు ఉపకార వేతనాలు అందించడం వంటి చర్యలు చేపడుతోంది.
రైతులే రాష్ట్రానికి వెన్నెముక
రైతులే రాష్ట్రానికి వెన్నెముక అని భావిస్తున్న సర్కారు.. గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధి, 50 శాతం వర్క్‌ఫోర్స్‌కు పని కల్పించడం ద్వారా అన్నదాతలకు సహకరించాలని నిర్ణయించింది. పంట మార్పిడి, సాగులో సాంకేతికతను జొప్పించడం, పంటల విలువలను పెంచడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని నిశ్చయించింది. రైతులకు మార్కెట్ సదుపాయాలు, పెట్టుబడి సాయం, రవాణా సదుపాయాలు, సాగునీటి సౌకర్యాన్ని కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తులు, డెయిరీ వ్యాపారాలకు గ్లోబల్ హబ్‌గా మారిందని.. ఆహార ఉత్పత్తుల ఎగుమతికి మరింత అవకాశం ఉందని తెలిపింది.
ప్రతి వ్యక్తికీ చౌకగా ఆరోగ్య సేవలు
రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ చౌక ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. ముఖ్యంగా.. వృద్ధులకు సంబంధించిన ఆరోగ్య సేవలపై మరింత దృష్టి పెట్టనుంది. డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు, టెలిమెడిసిన్, భవిష్యత్తులో అవసరమైన వైద్య సదుపాయాలకు ప్రాధాన్యమివ్వనుంది.
సున్నాస్థాయికి కర్బన ఉద్గారాలు..
రాష్ట్రంలో కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తగ్గించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి, సుస్థిర వ్యవసాయం, హరిత భవనాల్లో పెట్టుబడులను ప్రోత్సహించనుంది. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం, సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి సదుపాయాలను విస్తరించడం, పంప్‌డ్ స్టోరేజీ మౌలికవసతులను కల్పించడం ద్వారా నెట్ జీరో డెవల్‌పమెంట్ సాధించాలని నిర్ణయించింది.
కీలక శక్తిదాయకాలు..
రాష్ట్ర ప్రగతికి పలు కీలక శక్తిదాయకాల(కీ ఎనేబ్లర్స్)ను ప్రభుత్వం గుర్తించింది. టెక్ అండ్ ఇన్నోవేషన్, లాజిస్టిక్స్, ఎఫిషియంట్ ఫైనాన్సింగ్, సుపరిపాలన వంటివి అందులో ఉన్నాయి. లాజిస్టిక్స్‌లో భాగంగా డ్రైపోర్టులు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ పెంచడంలో పెట్టుబడులు పెడుతుంది. పీఎం గతి శక్తి పథకం కింద కొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. టీఎ్‌స-ఐపాస్, గోదాముల్లో ఫాస్ట్ ట్రాక్ సిస్టం, సింగిల్ విండో క్లియరెన్స్‌ల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సను పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ ఫార్మా ఎగుమతులు, కార్గో సౌకర్యాలను మరింత పెంచనుంది. టెక్ అండ్ ఇన్నోవేషన్‌లో భాగంగా.. వ్యవసాయం, విద్య, హెల్త్ కేర్, పరిశ్రమలు, పట్టణ పరిపాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఎఫిషియంట్ ఫైనాన్సింగ్‌లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షి్‌ప(పీపీపీ) విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, విద్య రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది. సుపరిపాలనలో భాగంగా పారదర్శకత, జవాబుదారీతనంపై దృష్టి పెట్టనుంది.