Sports Development Fund: 2036 ఒలింపిక్స్‌లో పతకాల సాధనే లక్ష్యం
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:00 AM
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే కొత్త క్రీడా పాలసీని ప్రకటించామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు....
వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు
ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సులో మంత్రి శ్రీహరి
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే కొత్త క్రీడా పాలసీని ప్రకటించామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. 2036లో నిర్వహించే ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించడమే ధ్యేయంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సులో మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ పెద్దలను కమిటీ సభ్యులుగా పెట్టి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయడమే కాకుండా నిధుల సమీకరణ కోసం స్పోర్ట్స్ డెవల్‌పమెంట్ ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీల ద్వారా పాఠశాల స్థాయి నుంచే క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్‌ను ఆతిథ్య కేంద్రంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. మంత్రి అజారుద్దీన్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, అంబటి తిరుపతి రాయుడు, బాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, గుత్తా జ్వాల పాల్గొన్నారు.