Bhatti Vikramarka: జీడీపీలో 10శాతం వాటాయే లక్ష్యం
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:43 AM
దేశ జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి)లో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని.. 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ....
దృఢమైన సంకల్పం, దార్శనికతతో ముందుకు..
అదనంగా 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
ఇంధన రంగంపై ప్యానల్ చర్చలో భట్టి విక్రమార్క
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): దేశ జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి)లో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని.. 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల (3 ట్రిలియన్) ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇంధన రంగంపై జరిగిన ప్యానల్ చర్చల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిపై ఒక దార్శనికతతో ముందుకు సాగుతున్నామని, దీని వెనుక స్పష్టమైన జాతీయవాద దృక్పథం, ప్రయోజనం, దృఢమైన సంకల్పం ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి అందరికీ సమానంగా అందేలా చూడటంతోపాటు పర్యావరణానికి మేలు చేసేదిగా, సుస్థిరంగా నిలిచేలా ఉండాలనేదే తమ అభిమతమని తెలిపారు. ‘‘విద్యుత్ అనేది మా దార్శనికతలో విడదీయరాని అంశం. మా సంకల్పానికి ఒకరకంగా గుండెకాయ వంటిది. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు పెరగాలన్నా, వ్యవసాయం అభివృద్థి చెందాలన్నా, జీవితం బాగుండాలన్నా విద్యుత్ రంగం పాత్ర కీలకం. ఇందులోనూ పర్యావరణ హిత ఇంధనాలు, వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. 2030 నాటికి దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థ హైదరాబాద్‌లో ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటికే ఉన్న 11.4 గిగావాట్ల (11,400 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్‌కు అదనంగా మరో 20 గిగావాట్ల (20 వేల మెగావాట్ల) విద్యుత్ ఉత్పిత్తి సామర్థ్యం సంతరించుకునే దిశగా పనిచేస్తున్నాం. విద్యుత్ రంగంలో ఇప్పటికే చాలా సాధించాం. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని టాప్ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ప్రభుత్వం నిర్దేశించుకున్న అభివృద్థి లక్ష్యాలు చేరుకోవాలంటే.. 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ డిమాండ్‌ను సాధారణ పద్ధతుల్లో తీర్చలేం. ఇందుకోసం మరిన్ని సౌర, థర్మల్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలు అవసరం’’ అని భట్టి చెప్పారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి గ్రీన్ బాండ్ల జారీ, ప్రత్యేకంగా రుణాల సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని కోల్‌బెల్ట్‌ను ఆర్థిక కేంద్రాలుగా మారుస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ వ్యవస్థలో సమూల మార్పులు చేయాలనే అంశంలో రాజీ లేదని ప్రకటించారు.