Minister Tummala Nageswara Rao: సోయా, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులివ్వండి
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:20 AM
సోయా బీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని, పంట కొనుగోళ్లలో సడలింపులివ్వాలని మరోమారు కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు...
కేంద్రానికి మరోమారు మంత్రి తుమ్మల లేఖ..
హైదరాబాద్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సోయా బీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని, పంట కొనుగోళ్లలో సడలింపులివ్వాలని మరోమారు కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. రాష్ట్రంలో మొంథా తుఫాన్, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా సోయా బీన్, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఈ పంటల కొనుగోళ్ల విషయంలో కొన్ని ప్రత్యేక సడలింపులివ్వాలని కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘సోయా బీన్ కోత సమయంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ మేరకు నాణ్యతా ప్రమాణాల విషయంలో సడలింపులివ్వాలి. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున మొత్తం 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య సంస్థలకు అనుమతి ఇవ్వాలి. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పత్తి కొనుగోలు విషయంలో తేమ శాతాన్ని సడలించాలి. ఎకరాకు 11.74 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా కొనుగోలు కొనసాగించాలి’ అని లేఖలో తుమ్మల కోరారు. ఈ విషయాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా గురువారం ఢిల్లీకి వెళ్లినముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా కోరామని తెలిపారు.