Share News

Thummala Nageswara Rao: యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

ABN , Publish Date - Aug 18 , 2025 | 03:57 AM

కేటాయింపుల మేరకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

Thummala Nageswara Rao: యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

  • ఈ నెలలో 80 వేల టన్నులు అదనంగా ఇవ్వాలి

  • రైతులు అవసరానికి మించి యూరియా కొనొద్దు: తుమ్మల

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కేటాయింపుల మేరకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. 9.80 లక్షల టన్నుల్లో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి, హాకా ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివా్‌సరెడ్డి, ఆగ్రోస్‌ ఎండీ రాములు, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌లతో సచివాలయంలో తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు కేటాయించిన 8.30 లక్షల టన్నుల్లో స్వదేశీ యూరియా 4.34 లక్షల టన్నులు, దిగుమతి యూరియా 3.96 లక్షల టన్నులు రావాల్సి ఉండగా.. స్వదేశీ యూరియా 3.27 లక్షల టన్నులు, దిగుమతి యూరియా 2.05 లక్షల టన్నులు వచ్చినట్లు పేర్కొన్నారు.


రామగుండం ఫ్యాక్టరీ 145 పనిదినాల్లో.. 78 రోజులు యూరియా ఉత్పత్తి చేయకపోవటం ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. 80 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి అదనంగా సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, గద్వాల జిల్లాల్లో యూరియా అమ్మకాలు ఎక్కువైనట్లు నివేదిక వచ్చిందన్నారు. యూరియాను ఇతర అవసరాలకు మళ్లించకుండా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీ చేయాలని, దారిమళ్లిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు అవసరానికి మించి యూరియా కొనొద్దని, ప్రతిపక్ష పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. యూరియాకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉన్నదని తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 03:57 AM