Agriculture Minister Tummala Nageshwar Rao: వరి వేస్తే ఉరే అన్న వారే బోన్‌సపై మాట్లాడటం విడ్డూరం
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:56 AM
గతంలో వరి వేస్తే ఉరే అన్న వారు.. ఇప్పుడు బోనస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.....
ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైనా భ్రమల్లోనే బీఆర్‌ఎస్ నేతలు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఎద్దేవా
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గతంలో వరి వేస్తే ఉరే అన్న వారు.. ఇప్పుడు బోనస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రూ.లక్ష రుణ మాఫీకి ఆపసోపాలు పడి వాయిదాల్లో చెల్లించలేక బీఆర్‌ఎస్ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. కానీ, తమ ప్రభుత్వం కొలువు దీరిన ఏడాదిలోనే ఒకే విడతలో రూ.2 లక్షల రుణ మాఫీ చేసిందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో పట్టణ ప్రజల్లో వ్యతిరేకతను చవిచూసినా.. మళ్లీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించండి’ అన్న ప్రకటనలు చూస్తుంటే భ్రమల నుంచి బీఆర్‌ఎస్ బయటకు రాలేదని అర్థమవుతోందని ఆయన అన్నారు. అరకొర రుణ మాఫీ, పంట కాలమంతా రైతు బంధు చెల్లించిన బీఆర్‌ఎస్.. తమ సర్కారును విమర్శించడం హాస్యాస్పదమని తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయకుండా వదిలేసిన సోయా చిక్కుడు, పెసళ్లను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కేంద్రం గత సీజన్‌లో సకాలంలో యూరియా పంపకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని, రబీ సీజన్‌లో ఇబ్బందులు తలెత్తకుండా తొలి 3 నెలల్లో 6 లక్షల టన్నులకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలపై సమీక్ష
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో వ్యవసాయశాఖ, ఇతర ముఖ్య విభాగాల మధ్య సమన్వయం అవశ్యమని తుమ్మల తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ సన్నాహాల పురోగతిని సమీక్షించడానికి ఆదివారం సమ్మిట్ వార్ రూమ్‌ను ఆయన సందర్శించారు. అధికారులంతా ఒక జట్టుగా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ను మంత్రి తుమ్మల పరామర్శించారు. ఇటీవల సీఎం రమేశ్ మాతృమూర్తి రత్నమ్మ మృతి చెందారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా ఎర్రగుంట మండలంలోని పొట్లదుర్తి గ్రామంలోని సీఎం రమేశ్ ఇంటికెళ్లి రత్నమ్మ చిత్ర పటానికి పుష్పాలు వేసి నివాళులర్పించారు.