Godavari Cauvery river linking project: నదుల అనుసంధానానికి షరతులతో తెలంగాణ అంగీకారం
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:20 AM
ఇచ్చంపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్ నుంచి గోదావరి-కావేరి అనుసంధానం కోసం నీటి తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో..
వెల్లడించిన ఎన్‌డబ్ల్యూడీఏ
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇచ్చంపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్ నుంచి గోదావరి-కావేరి అనుసంధానం కోసం నీటి తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో అంగీకరించిందని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) తెలిపింది. అక్టోబరు ఒకటో తేదీన జరిగిన పాలక మండలి సమావేశ మినిట్స్‌ను మంగళవారం ఎన్‌డబ్ల్యూడీఏ విడుదల చేసింది. దేవాదుల కింద 38 టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతల ద్వారా 67 టీఎంసీలు, సమ్మక్క సాగర్ (తుపాకుల గూడెం) కింద 47టీఎంసీలు వాడుకున్నాకే.. వాటిపై సిమ్యులేషన్ అధ్యయనాలను పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలని తెలంగాణ నివేదించింది. ఇచ్చంపల్లి నిర్మించిన తర్వాత 200 టీఎంసీల వరద జలాలను వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. గోదావరి-కావేరీ అనుసంధానంలో 50 ు వాటాను తమకే కేటాయించాలని.. ఆ నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛనివ్వాలని తెలంగాణ కోరింది. ఈ వాటా జలాల వినియోగానికి కేంద్ర నిధులతో 2 రిజర్వాయర్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. గోదావరిపై 968 టీఎంసీల వినియోగానికి చేపట్టిన ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వాలని తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి సాగర్ వరకు నీటిని తరలించే కన్వేయర్ సిస్టమ్‌పై సంయుక్త అధ్యయనాలు చేసి సాధ్యమైనంత మేరకు ముంపు తగ్గించాలని కోరింది. ఇచ్చంపల్లి నుంచి తరలించే జలాలను నాగార్జున సాగర్‌లోకి కాకుండా దిగువన 7 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన టెయిల్‌పాండ్‌కు మళ్లించాలని సూచించింది. దీంతో కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీలను ఆల్మట్టిలో వాడుకుంటే దాని ప్రభావం జూరాలపై పడుతుందని, ఈ విషయమై పునరాలోచన చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. గోదావరి- కావేరి అనుసంధానంలో భాగంగా ఏపీ ప్రతిపాదించిన 4 ఇంట్రాలింక్ కాన్సెప్ట్ నోట్‌లను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్ తయారు చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుసంధాన ప్రాజెక్టుపై అందరి సమ్మతి తెలిపే మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్‌పై సంతకాలు చేయడానికి తొందరేం లేదని పేర్కొన్నది.