Share News

CM Revanth Reddy: తెలంగాణ హెల్త్‌ ఫస్ట్‌ వ్యూహం

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:44 AM

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసంకాంగ్రెస్‌ ప్రభుత్వం హెల్త్‌ ఫస్ట్‌ వ్యూహానికి రూపకల్పన చేస్తోంది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే వారి ఉత్పాదకత పెరిగి అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనతో రూపొందించిన...

CM Revanth Reddy: తెలంగాణ హెల్త్‌ ఫస్ట్‌ వ్యూహం

  • విజన్‌-2047 డాక్యుమెంటులో ఆరోగ్యానికి ప్రాధాన్యం.. పీహెచ్‌సీల్లో 2047 నాటికి వంద శాతం డాక్టర్లు

  • వృద్ధుల కోసం హెల్తీఏజింగ్‌ తెలంగాణ మిషన్‌

  • డాక్యుమెంటుకు వైద్యశాఖ రూపకల్పన

  • దీనిపై రేపు సీఎం రేవంత్‌ సమీక్ష

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసంకాంగ్రెస్‌ ప్రభుత్వం ‘హెల్త్‌ ఫస్ట్‌’ వ్యూహానికి రూపకల్పన చేస్తోంది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే వారి ఉత్పాదకత పెరిగి అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనతో రూపొందించిన ‘హెల్త్‌ డెవల్‌పమెంట్‌ ఫస్ట్‌’ అజెండాలో పలు లక్ష్యాలను నిర్దేశించుకుంది. విజన్‌ -2047 డాక్యుమెంట్‌ ద్వారా ఆర్థిక వృద్థితోపాటు మానవ సమగ్ర అభివృద్థిని ప్రధాన వ్యూహంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆరోగ్యం, విద్య, ఆదాయాన్ని ఒకే కొలమానంగా తీసుకునే మానవ అభివృద్థి సూచిక (హెచ్‌డీఐ)లో 2047 నాటికి రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలపాలని రేవంత్‌ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్థు ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించి నివేదికను రూపొందించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ, క్రిష్టినా జడ్‌ చోంగ్థుతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించాయి.


2047 నాటికి పీహెచ్‌సీల్లో 100 శాతం డాక్టర్లు

గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్‌సీ)ల్లో ప్రస్తుతం 42.8 శాతం మంది వైద్యులు ఉండగా, వచ్చే ఐదేళ్లలో దాన్ని 60 శాతానికి, 2047 నాటికి వందశాతానికి తీసుకెళ్లాలని వైద్యఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రతి పదివేల మంది జనాభాకు డాక్టర్‌, నర్సుల నిష్పత్తి పది వరకు ఉండగా, దాన్ని 2047 నాటికి 44కు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీఎ్‌సడీపీ)లో వైద్య రంగం వాటా 1 శాతం ఉండగా, దానిని 5 శాతానికి పెంచాలని నిర్ణయించారు. పిల్లలు, యుక్త వయస్సు బాలికలు, మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు ప్రస్తుత చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు వైద్యం పెడుతున్న ఖర్చులో 37 శాతం ప్రైవేటు రంగంలోకి వెళ్తోందని, దానిని 2047 నాటికి 6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, కార్పొరేట్‌ రంగాల నుంచి 63శాతం వైద్య ఖర్చులు వెళ్తున్నాయి.

వృద్ధుల కోసం సిల్వర్‌ సిటీ జోన్స్‌

రాష్ట్రంలో 2036 నాటికి 60 ఏళ్ల వయస్సు పైబడిన జనాభా 17ు దాటే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో వృద్ధుల సంరక్షణ కోసం నైపుణ్యాభివృద్థి, ఆరోగ్య బీమా, వృద్థాప్య, మానసిక ఆరోగ్య సహాయం వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. ‘హెల్తీ ఏజింగ్‌ తెలంగాణ మిషన్‌’లో భాగంగా వృద్థుల కోసం సిల్వర్‌ సిటీ జోన్స్‌, యాక్టివ్‌ ఏజింగ్‌ హబ్స్‌, మెంటార్‌షిప్‌, సెకండ్‌ లైఫ్‌ కెరీర్స్‌ వంటి కార్యక్రమాల ద్వారా గౌరవప్రదమైన వృద్థాప్య జీవనానికి ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించనున్నారు. అంటువ్యాధుల పర్యవేక్షణ, స్ర్కీనింగ్‌ కోసం డిజిటల్‌, కృత్రిమ మేధ(ఏఐ)ను వినియోగించాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునిక వైద్య సేవలనుఅందుబాటులోకి తేవటంపై దృష్టి సారించనున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 03:44 AM