Share News

Highways: పల్లె నుంచి పట్నం.. రయ్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 07:04 AM

రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా దూసుకుపోతోంది.

Highways: పల్లె నుంచి పట్నం..  రయ్‌

  • ‘హ్యామ్‌’తో రూ.11,399కోట్లతో రోడ్ల అభివృద్ధి

  • మొత్తం 6617కోట్ల విలువైన పనులకు అనుమతి

  • శ్రీశైలానికి ఎలివేటెడ్‌ కారిడార్‌.. రోడ్లకు మహర్దశ

  • కొత్తగా కోటి చదరపు అడుగుల భవన నిర్మాణాలు

  • రెండేళ్లలోనే రోడ్లు, భవనాల శాఖ రికార్డు

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా దూసుకుపోతోంది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తెలంగాణను దేశంలోనే లాజిస్టిక్స్‌ హబ్‌గా మార్చేందుకు వేల కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగానే రూ. 6617.86 కోట్ల విలువైన 239 పనులకు అనుమతులు వచ్చాయి. ఇందులో 1659 కి.మీ రహదారులు, 62 వంతెనలను నిర్మించడంతోపాటు 1383 కి.మీ రోడ్లను సింగిల్‌ లేన్‌ నుంచి డబుల్‌ లేన్‌గా, 242 కి.మీ రహదారులను ఫోర్‌ లేన్‌గా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 514.80 కి.మీ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మౌలిక సదుపాయాల పెంపులో భాగంగా రూ. 60,799 కోట్లతో ప్రకటించిన భారీ ప్రాజెక్టులు రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి పోశాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ‘‘మిర్రర్‌ స్మూత్‌’’ రోడ్లు, ప్రమాద రహిత రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) కింద రూ.11,399 కోట్లతో 419 రోడ్లను 32 ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేయన్నారు. హైదరాబాద్‌ - విజయవాడ హైవేను రూ. 10,400 కోట్లతో 8 లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్‌ సిద్ధమవుతోంది. తెలంగాణకు మణిహారంగా మారనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ - అమరావతి- మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలిచారు.


హైదరాబాద్‌- శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ను మన్ననూర్‌ నుంచి శ్రీశైలం వరకు సుమారు రూ. 8 వేల కోట్లతో నిర్మించనున్నారు. వరంగల్‌, ఆదిలాబాద్‌, రామగుండం కొత్త విమానాశ్రయాలకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది చివరి నాటికి వరంగల్‌ విమానాశ్రయంలో కార్గో ేసవలు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లలోనే రూ. 7వేల కోట్ల వ్యయంతో ఒక కోటి చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వం పదేళ్లలో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడితే.. కేవలం రెండేళ్లలోనే ఆ రికార్డును కాంగ్రెస్‌ సర్కారు బ్రేక్‌ చేసింది. రూ.2583 కోట్లతో రాజేంద్ర నగర్‌లో కొత్త హైకోర్టు కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని రూ.2700 కోట్లతో చేపట్టనున్నారు. సనత్‌ నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌ ఆస్పత్రులు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Dec 07 , 2025 | 07:05 AM