Kharif Marketing Season: వంద శాతం పంటల సాగు
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:36 AM
ఈ వానాకాలంలో పంటల సాగు వంద శాతం పూర్తయింది. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1,32,44,305 ఎకరాలు కాగా... ఇప్పటివరకు 1,33,09,765 ఎకరాల్లో పంటలు సాగుచేసినట్లు వ్యవసాయశాఖ...
ఈ వానాకాలంలో పంటల సాగు వంద శాతం పూర్తయింది. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1,32,44,305 ఎకరాలు కాగా... ఇప్పటివరకు 1,33,09,765 ఎకరాల్లో పంటలు సాగుచేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలో వెల్లడించింది. సుమారు 133.10 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగుచేయటం ద్వారా సాధారణం కంటే 0.5 శాతం విస్తీర్ణం ఈసారి పెరిగింది. ప్రధాన పంటలైన వరి 67.31 లక్షల ఎకరాల్లో, పత్తి 45.95 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 6.45 లక్షలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. మిగిలిన విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు, నూనె గింజ లు, ఇతర పంటలు సాగుచేశారు. నిరుడు ఖరీ్‌ఫలో 129 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు సాగుచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్ అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ కూడా దేశవ్యాప్తంగా అక్టోబరు నుంచే శ్రీకారం చుడుతుంది. ధాన్యం సేకరించే ఎఫ్‌సీఐ అయినా, పత్తి కొనుగోళ్లు చేసే సీసీఐ అయినా... రాష్ట్రంలో వరి, పత్తి కాకుండా మొక్క జొన్న, జొన్న, సోయాబీన్ లాంటి ఇతర పంటలను కొనుగోలుచేసే మార్క్‌ఫెడ్ కూడా అక్టోబరు నుంచి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభిస్తాయి. అయితే నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ముందస్తుగా ధాన్యం వస్తే... కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. అయితే, పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభం అవుతున్నా.. ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామనే విషయాన్ని సీసీఐ వెల్లడించలేదు. జాబ్ వర్క్ కోసం సీసీఐ పిలిచిన టెండర్లలో కూడా జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లర్లు పాల్గొనలేదు. ఈ అంశంపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా దృష్టిసారించారు. పత్తి కొనుగోళ్లపై కొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.