Teen Arrested for Fake IPS: ఐపీఎస్ నకిలీ ప్రొఫైల్‌తో టోకరా
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:11 AM
రాజస్థాన్‌లోని రాంసిన్ గ్రామం అంటే ఇతర రాష్ట్రాల పోలీసులకు హడల్. స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఆ ఊరికెళ్లిన ఇతర రాష్ట్రాల...
నిజామాబాద్ వాసి నుంచి 50 వేలు స్వాహా చేసిన 17 ఏళ్ల కుర్రాడి అరెస్టు
నిందితుడు రాజస్థాన్‌లోని రాంసిన్ వాసి
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లోని రాంసిన్ గ్రామం అంటే ఇతర రాష్ట్రాల పోలీసులకు హడల్. స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఆ ఊరికెళ్లిన ఇతర రాష్ట్రాల పోలీసులపై దాడులు చేసిన ఘటనలు అనేకం. ఈ గ్రామస్తుల్లో అత్యధికులు సైబర్ నేరాలకు పాల్పడుతుండటమే దీనికి కారణం. పక్కా ఆధారాలు చూపితే గానీ.. తమ గ్రామ వాసిని పోలీసులు తీసుకెళ్లడానికి రాంసిన్ వాసులు అనుమతించరు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేరిట నకిలీ ప్రొఫైళ్లు తయారు చేసి ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచి.. అమాయకులను బురిడీ కొట్టించడం రాంసిన్ వాసుల స్పెషాలిటీ. డీఐజీ సునీల్ కుమార్ (ఐపీఎస్) పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టును నిజామాబాద్ జిల్లాలోని రిటైర్డు టీచర్ ఆమోదించడంతోపాటు హాయ్ అని ఫేస్‌బుక్ మెసేంజర్‌లో మెసేజ్ పెట్టారు. ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటున్న వ్యక్తితో సదరు టీచర్ కొన్నాళ్లు చాటింగ్ సాగించారు. తర్వాత కొంత కాలానికి తన వద్ద పని చేసే సంతోష్ కుమార్ అనే సీఆర్‌పీఎఫ్ అధికారికి బదిలీ అయిందని, విలువైన ఫర్నీచర్‌ను తక్కువ ధరకు ఇవ్వనున్నారని చెప్పి.. సంతోష్ కుమార్‌దంటూ ఒక ఫోన్ నంబరు పంపాడు. వాట్సాప్‌లో సంతో్‌షకుమార్ యూనిఫామ్‌తో ఉన్న ఫొటోలు చూసి నమ్మిన బాధితుడు.. రూ.80 వేలకు బేరం కుదుర్చుకుని రూ.50 వేలు అడ్వాన్సు పంపినా ఫర్నిచర్ రాలేదు. దీంతో ఆయన.. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే అది పని చేయడం లేదంటూ నిజామాబాద్ సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. బాధితుడి ఫేస్‌బుక్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో రాజస్థాన్‌లోని రాంసిన్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడు ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఆ జువైనల్ నేరగాడ్ని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ మంగళవారం తెలిపారు. రాంసిన్ లోని సైబర్ నేరగాళ్ల ముఠాతో ఇటీవల చేతులు కలిపిన ఈ కుర్రాడు ఇలా మోసాలకు పాల్పడుతున్నట్టు షికా గోయల్ చెప్పారు.