Share News

Srisailam Power Plant: శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌లో మళ్లీ సాంకేతిక సమస్య

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:45 AM

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌లో మరోసారి సాంకేతిక సమస్యతో ఉత్పత్తి నిలిచిపోయింది. పునరుద్ధరించేందుకు కొంత సమయం పడుతుందని...

Srisailam Power Plant: శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌లో మళ్లీ సాంకేతిక సమస్య

  • ప్రారంభించిన 10 గంటల్లోపే మొరాయించిన స్టేటార్‌

  • నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి.. సెన్సార్లూ పనిచేయలేదు

  • మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనున్న వాయిత్‌ కంపెనీ

బ్రహ్మగిరి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌లో మరోసారి సాంకేతిక సమస్యతో ఉత్పత్తి నిలిచిపోయింది. పునరుద్ధరించేందుకు కొంత సమయం పడుతుందని జెన్‌కో ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. 2020 ఆగస్టు 20న షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించి నాలుగో యూనిట్‌ కాలిపోగా.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి చెందిన వాయిత్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ఈ యూనిట్‌ మరమ్మతు పనులు చేపట్టింది. 2021 సెప్టెంబరులో పనులు ప్రారంభించి 2023 జూలై నాటికి పూర్తి చేసి జెన్‌కోకు అప్పగించింది. ఆ నెల 17న నాలుగో యూనిట్‌ను ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 2023 ఆగస్టు 17న స్టేటార్‌ వైండింగ్‌ బార్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మరోసారి మంటలు చెలరేగి యూనిట్‌ కాలిపోయింది. గత సంవత్సరం మళ్లీ మరమ్మతు పనులు ప్రారంభించి.. చైనా నుంచి స్టేటార్‌ బార్స్‌ను రప్పించి బిగించారు. ఏడాది పాటు మరమ్మతు పనులు కొనసాగగా.. ఈ నెల 2న విజయదశమి రోజున రాత్రి పూజలు నిర్వహించి ప్రారంభించారు. పది గంటలు తిరగకుండానే సాంకేతిక సమస్యలతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. స్టేటార్‌ మొరాయించడంతో సమస్య మొదటికొచ్చిందని ఇంజనీర్లు అంటున్నారు. సాంకేతిక సమస్యలు, ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెన్సార్లు కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఎక్కడ లోపం జరిగింది.. తదుపరి కార్యాచరణ ఏంటనే విషయంపై వాయిత్‌ కంపెనీ జెన్‌కో యాజమాన్యానికి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మొదటి నుంచి అనుమానమే!

వాయిత్‌ కంపెనీ మొదటిసారి మరమ్మతు పనులు చేపట్టిన కొద్ది రోజులకే స్టేటార్‌ వైండింగ్‌ బార్స్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోయాయి. అందుకు నాసిరకం మెటీరియల్‌ వాడటమే కారణమని ఇంజనీర్లు అనుమానం వ్యక్తం చేశారు. మరోసారి చైనా నుంచి ఎలక్ట్రికల్‌ మెటీరియల్‌ తెప్పించడం, పనుల్లో నాణ్యత లోపిస్తే మళ్లీ సమస్య తప్పదని యూనిట్‌ ఇంజనీర్లు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 08 , 2025 | 04:45 AM