Teachers Protest: ఓపిక నశించింది.. ఇక పోరుబాటే
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:39 AM
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ..
20 నెలల్లో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ
ఈనెల 23న హైదరాబాద్‌లో మహాధర్నా
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న 31 సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రంలోని 18 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎ్‌సపీసీ)గా ఏర్పడ్డాయి. సోమవారం నగరంలోని యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 23న నగరంలోని ధర్నాచౌక్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉపాధ్యాయులంతా ఉద్యమబాట పడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో, మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. నూతన జిల్లాలకు డీఈవో, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయడంతో పాటు, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల, పెన్షనర్ల, వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమయ్య, లింగారెడ్డి కోరారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, మంత్రులు, ఆఫీసర్ల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దశలవారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యూఎ్‌సపీసీ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో పోరుబాటకు ఉపాధ్యాయులంతా సిద్ధంగా ఉన్నారని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.