Teachers Protest: విద్యార్థిని బడికి పంపాలని ఉపాధ్యాయుల ధర్నా
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:38 AM
విద్యార్థిని సక్రమంగా బడికి పంపాలని కోరుతూ పాఠశాల టీచర్లు, విద్యార్థులు శనివారం బాలుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు.
విద్యార్థులతో కలిసి బాలుడి ఇంటి ఎదుట నిరసన
కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఘటన
దుమ్ముగూడెం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థిని సక్రమంగా బడికి పంపాలని కోరుతూ పాఠశాల టీచర్లు, విద్యార్థులు శనివారం బాలుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని నిమ్మలగూడెంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నక్క మనోవరుణ్ నిమ్మలగూడెం గిరిజన పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అతడు కొద్ది రోజులుగా పాఠశాలకు సరిగా రావడంలేదు. వచ్చినా, ఉపాధ్యాయుల కంట పడకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాడు. బాలుడిని సక్రమంగా బడికి పంపాలని టీచర్లు పలుమార్లు తల్లిదండ్రులకు సమాచారమిచ్చినా వారు స్పందించలేదు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థి ఇంటి ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. సోమవారం నుంచి తప్పనిసరిగా విద్యార్థిని బడికి పంపుతామని బాలుడి తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ప్రతి చిన్నారి విద్యా హక్కును పరిరక్షించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందించడం తమ బాధ్యత అని, అది తెలియజేయడం కోసమే ఇలా చేశామని హెచ్‌ఎం రవి తెలిపారు.