Share News

K Lakshminarayana: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకం

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:26 AM

సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. ఉన్నతమైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని విశ్రాంత ఐఏఎస్‌...

K Lakshminarayana: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకం

  • విద్యనే దేశాభివృద్ధికి ప్రాణవాయువు: విశ్రాంత ఐఏఎస్‌ కె. లక్ష్మీనారాయణ

  • లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ 320డీ ఆధ్వర్యంలో గురువందనం

రవీంద్రభారతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. ఉన్నతమైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని విశ్రాంత ఐఏఎస్‌, ఉమ్మడి ఏపీ ఉన్నత విద్యా శాఖ మాజీ కమిషనర్‌ కె.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు సాంకేతికత ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. ఏ దేశమైనా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో పురోగమించడానికి విద్య ప్రాణవాయువుగా నిలుస్తుందని అన్నారు. విద్యా రంగాన్ని మరింత పరిపుష్టం చేసుకునే దిశగా మనమంతా ఆలోచించాలని కోరారు. లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ 320డీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతి వేదికగా ‘దిల్‌సే గురువందనం’ పేరుతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు, మోడల్‌ స్కూళ్లలో సేవలందిస్తున్న 128 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడారు. చదువులు అనగానే ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ మాత్రమే అనే అభిప్రాయం నుంచి తెలుగు వారు బయటపడాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచిని గుర్తించి, ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాలంలో తరగతి గదికి సాంకేతికత అనుసంధానం కావాలని, ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఉండాలని సూచించారు. పుస్తకం చదవడం ద్వారా జ్ఞానాన్ని, సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా విజ్ఞానాన్ని, ఆత్మావలోకనం చేసుకోవడం ద్వారా దైవజ్ఞానాన్ని పొందగలమని చెప్పారు. తద్వారా సమాజంలో మన పాత్రను గ్రహించగలమన్నారు. ఈ శతాబ్దానికి తగినట్టుగా ముందుకు సాగాలంటే శాస్త్రీయ ఆలోచన, అభ్యాసన, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం చాలా అవసరమని వివరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా కార్యదర్శి ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా ఆల్‌ ఇండియా లయన్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బాబూరావు, డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ అమర్‌నాథరావు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు జ్యోతి, విజయలక్ష్మి, గంప రమేష్‌, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌, జీఆర్‌ సూర్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 03:26 AM