CM Chandrababu Naidu: పోటీకి టీడీపీ దూరం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:34 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీకీ పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో...
ఎవరికీ మద్దతివ్వకూడదని నిర్ణయం
సమర్థులకే టీటీడీపీ బాధ్యతలు
తెలంగాణ రాజకీయాల్లో.. బలమైన శక్తిగా ఎదుగుదాం
టీటీడీపీ నేతలతో చంద్రబాబు
హైదరాబాద్, అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీకీ పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందున బీజేపీ కోరితే జూబ్లీహిల్స్‌లో మద్దతు విషయం ఆలోచిద్దామని చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వాన్ని అందించేవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని టీటీడీపీ నాయకులకు స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత కమిటీల నియామకాలు పూర్తిచేసుకుని కార్యక్రమాలు పెంచాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుదాం.. ఇందుకోసం సంస్థాగతంగా బలోపేతం కావడం ముఖ్యం.. అన్ని స్థాయుల్లో కమిటీలను పూర్తిచేయండి. ఎప్పటికప్పుడు నేను కూడా దిశానిర్దేశం చేస్తా..’ అని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తిచేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీని నియమించాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్లు చంద్రబాబుకు నాయకులు వివరించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీలో చురుగ్గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. ఆ నియామకం ఆలస్యం అయ్యేలా ఉంటే... ఈలోపు ముఖ్య నాయకులతో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.