Share News

Drug Case: డ్రగ్స్‌ కేసుల పేరుతో బెదిరిస్తూ.. ఎస్టీఎఫ్‌ కానిస్టేబుల్‌ వసూళ్లపర్వం

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:17 AM

ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్టీఎఫ్‌ లో ఓ కానిస్టేబుల్‌.. ఇన్‌స్పెక్టర్‌నని నమ్మబలుకుతూ అక్రమాలకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి...

Drug Case: డ్రగ్స్‌ కేసుల పేరుతో బెదిరిస్తూ.. ఎస్టీఎఫ్‌ కానిస్టేబుల్‌ వసూళ్లపర్వం

  • ఇన్‌స్పెక్టర్‌నని చెప్పుకుంటూ అరాచకాలు

  • సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలే లక్ష్యం

  • అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌)లో ఓ కానిస్టేబుల్‌.. ఇన్‌స్పెక్టర్‌నని నమ్మబలుకుతూ అక్రమాలకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉమామహేశ్వర్‌రావు అలియాస్‌ మహేశ్వర్‌రావు ఎస్టీఎ్‌ఫ-బీ బృందంలో కానిస్టేబుల్‌. కానీ, తాను ఎస్సైని, సీఐని అని చెప్పుకుంటూ సినీ ప్రముఖులను, వ్యాపారులను, సామాన్యులను బెదిరించి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడేళ్లుగా ఎస్టీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్‌రావు ట్రూకాలర్‌లో తన పేరును ఇన్‌స్పెక్టర్‌గా పెట్టుకుని, డ్రగ్స్‌ను పట్టుకోవడంలో దిట్టనని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, డబ్బులు ఇవ్వకుంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులను కూడా ఉమామహేశ్వర్‌రావు బెదిరించడంతో వారు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒక్కడే ఈ నేరాలకు పాల్పడ్డాడా లేక ఎవరైనా అధికారులు, ఇతరులు సహకరిస్తున్నారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతడి కాల్‌డేటా, ఆర్థిక లావాదేవీలు, సోషల్‌ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతను ఇప్పటి వరకు ఎంతమందిని బెదిరించాడు, ఎంత డబ్బులు వసూలు చేశాడనే వివరాలు సేకరిస్తున్నారు.


సస్పెండ్‌ అయినా మారని తీరు

ఉమామహేశ్వర్‌రావు ఇటీవల బంజారాహిల్స్‌లో ఒక బార్‌ నిర్వాహకుడిని బెదిరించి రూ.6 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఒక కేసులో నలుగురిపై డ్రగ్స్‌ కేసు కూడా పెడతానని బెదిరించి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు మహిళలను బెదిరించి రూ.2 లక్షలు తీసుకుని, ఆపై అసభ్యంగా ప్రవర్తించడంతో నాలుగు రోజుల క్రితం ఎక్సైజ్‌ ప్రధాన కార్యలయం వద్ద అతడికి దేహశుద్ధి చేశారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఎస్టీఎ్‌ఫ-ఏ టీంలో ఉండగా కూడా ఉమామహేశ్వర్‌రావు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో ససెన్షన్‌కు గురయ్యాడు. ఆరు నెలలు తిరగకుండానే మరో టీమ్‌ (ఎస్టీఎ్‌ఫ-బీ)లోకి రాగలిగాడు. ఎక్సైజ్‌ పోలీసు సంఘం నాయకుడికి బంధువు కావడంతో అతడి అరాచకాలకు అడ్డులేకుండా పోయింది. జాయింట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్ల పర్యవేక్షణ లోపంతో ఉమామహేశ్వర్‌రావు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Updated Date - Sep 10 , 2025 | 04:17 AM