N Ramchander Rao: ఇదేం ద్వంద్వనీతి?
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:12 AM
కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని టీబీజేపీ చీఫ్ ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను...
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు?
ఏ ప్రభుత్వ విభాగం సమర్థంగా పనిచేస్తుందో సీఎం చెప్పాలి
రాజాసింగ్ విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదు
టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని టీబీజేపీ చీఫ్ ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను గడువులోగా గవర్నర్ ఆమోదించాలంటున్న కాంగ్రెస్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సమయానుసారంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో రాంచందర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనకు పక్షవాతం వచ్చిందని, ఏ ప్రభుత్వ విభాగం సమర్థంగా పనిచేస్తుందో సీఎం రేవంత్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దావోస్ వెళ్లి రూ.70వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసుకున్నా సీఎం, మంత్రుల విమాన ఖర్చుల మేర కూడా పెట్టుబడులు వచ్చిన దాఖలా లేదని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం 3 బ్యారేజీలకే పరిమితం చేయకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబరు 17పై కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు ఒవైసీ ఫోబియా పట్టుకుందని రాంచందర్‌రావు విమర్శించారు. తమ పార్టీ ఆఫీసుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పార్టీలు, అధికారికంగా మాత్రం కొనసాగించకపోవడం శోచనీయమన్నారు. కొత్త కమిటీపై రాజాసింగ్ చేసిన విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాజాసింగ్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ ఇస్తారా? అనే ప్రశ్నకు రాంచందర్‌రావు స్పందిస్తూ, ఆ అంశాన్ని జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు. తమ సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా రాంచందర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు. రాష్ట్రానికి యూరియా సరఫరాలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అయినా వచ్చిన యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవడంలో వ్యవసాయశాఖ మంత్రి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.