Domestic Dispute: అనుమానం పెనుభూతమై.. భార్యను హత్యచేసిన భర్త
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:01 AM
తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు....
సంగారెడ్డి జిల్లా అమీన్‌పుర్‌లో దారుణం
ఆమె కోహీర్ డీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్
అమీన్‌పూర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పుర్ పట్టణంలో ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణవేణి (40) కోహీర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ భర్త వెంకటబ్రహ్మం, ఇద్దరు పిల్లలతో కలిసి అమీన్‌పుర్‌లో నివాసముంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి కొన్నిరోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వెంకటబ్రహ్మం.. కృష్ణవేణికి ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయంలో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. ఆదివారం జరిగిన గొడవలో పట్టరాని ఆవేశంలో ఉన్న వెంకటబ్రహ్మం అక్కడే ఉన్న క్రికెట్ బ్యాట్‌తో భార్యపై దాడికి దిగాడు. తలపై బ్యాట్‌తో పలుమార్లు బాదడంతో తీవ్ర రక్తస్రావమై కృష్ణవేణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె ఇంటర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటుండగా, కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ నరేశ్ తెలిపారు.