Suspects Arrested After Violent Attack: మహిళను హత్య చేసి..ఆరు గంటలు సిటీలోనే తిరిగి..
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:00 AM
కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు సినీ ఫక్కీలో ఛేదించారు. హత్య చేసి జార్ఖండ్‌లోని రాంచీకి పారిపోయిన యువకులపై..
కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్యకేసునుసినీ ఫక్కీలో ఛేదించిన పోలీసులు
నిందితుల ఫోన్ కాల్స్ ఆధారంగా నిఘా
విమానాల్లో ఒక టీమ్ ఢిల్లీకి, మరో టీమ్ రాంచీకి..
జార్ఖండ్‌లోని రాంచీలో ఇద్దరు నిందితులు, వారికి సహకరించిన మరొకరి అరెస్టు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు సినీ ఫక్కీలో ఛేదించారు. హత్య చేసి జార్ఖండ్‌లోని రాంచీకి పారిపోయిన యువకులపై.. టెక్నాలజీతో నిఘా పెట్టి, విమానంలో వెళ్లి పట్టుకున్నారు. వారికి సహకరించిన మరో యువకుడినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు, కొంత బంగారం, 16 గడియారాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ అవినాశ్ మహంతి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
దోపిడీ కోసం రెండు రోజులు రెక్కీ..
స్వాన్‌లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్‌లో ఉండే రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతుల ఇంట్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన శంకర్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జార్ఖండ్‌కు చెందిన హర్ష పదిరోజుల క్రితం పనిలో చేరాడు. అదే అపార్టుమెంట్ పై అంతస్తులో ఉండే రాకేశ్ సోదరుడి ఇంట్లో జార్ఖండ్‌కే చెందిన రోషన్ అనే యువకుడు 11 నెలలుగా పనిచేస్తున్నాడు. రోషన్‌కు డ్రగ్స్, గంజాయి వ్యసనాలు ఉన్నాయి. అతడిపైౖ జార్ఖండ్‌లోని మూడు పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఇద్దరూ కలసి రాకేశ్ అగర్వాల్ ఇంట్లో బంగారం, డబ్బు కొట్టేసేందుకు పథకం వేశారు. ఇందుకోసం ఈ నెల 8, 9 తేదీల్లోరెక్కీ చేశారు. 10వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న రాకేశ్ భార్య రేణు అగర్వాల్‌ను కట్టేసి.. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలని చిత్రహింసలు పెట్టారు. ఆమె చెప్పకపోవడంతో కుక్కర్‌తో తలపై కొట్టి, కత్తితో గొంతుకోసి హత్య చేశారు. తర్వాత అదే ఇంట్లో స్నానం చేశారు. ఇంట్లో ఉన్న 16 గడియారాలు, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలను తీసుకుని, బ్యాగులో బట్టలు సర్దుకుని యజమాని స్కూటీపై హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఎంఎంటీఎ్‌సలో సికింద్రాబాద్ వెళ్లడానికి టికెట్లు కొన్నారు. కానీ ప్లాట్‌ఫామ్ వద్ద పోలీసులను చూసి స్టేషన్ బయటికి వచ్చారు. రాత్రి 11 గంటల వరకు బస్సుల్లో నగరంలోనే తిరిగారు. తర్వాత మాదాపూర్‌లో క్యాబ్ మాట్లాడుకుని రాంచీకి బయల్దేరారు. ఇలా హత్య చేసి మధ్యాహ్నం 4:30 గంటలకు బయటికి వచ్చిన నిందితులు.. ఆరున్నర గంటలు నగరంలోనే తిరిగారు.
టెక్నాలజీతో నిఘా పెట్టి.. విమానాల్లో వెళ్లి..
హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర ఆధారాలతో నిందితులు క్యాబ్‌లో రాంచీకి బయల్దేరినట్టు గుర్తించారు. ఢిల్లీలోని ఓ యువకుడికి పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడటంతో ఢిల్లీకి పారిపోయే యత్నంలో ఉండొచ్చని భావించారు. వెంటనే విమానంలో ఒక టీమ్‌ను రాంచీకి, మరో టీమ్‌ను ఢిల్లీకి పంపారు. అయితే నిందితులు రాంచీకి చేరుకుని.. రోషన్ సోదరుడు రాజువర్మ గదికి వెళ్లారు. రాజువర్మ వారిని ఒక ఓయో లాడ్జిలోని గదిలో ఉంచాడు. ఢిల్లీ వెళ్లిన పోలీసు బృందం.. నిందితులతో ఫోన్ మాట్లాడిన యువకుడిని పట్టుకుంది. అతడితో నిందితులకు ఫోన్ చేయించి వారెక్కడ ఉన్నదీ తెలుసుకుని రాంచీలో ఉన్న పోలీసు బృందానికి సమాచారం అందజేసింది. ఈ బృందం స్థానిక పోలీసుల సాయంతో లాడ్జికి వెళ్లి.. హర్ష, రోషన్‌లతోపాటు వారికి సహకరించిన రాజువర్మను అరెస్టు చేశారు. ఈ సమయంలో రోషన్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.