Farming Issues: సర్వే నెంబర్ ఒకచోట.. సాగు మరోచోట
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:30 AM
రైతులు ఏళ్ల తరబడి ఒక సర్వే నెంబర్‌కు బదులు మరో సర్వే నెంబర్‌లోని భూమిని సాగు చేసుకుంటున్న విషయం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో...
కేటాయించిన భూమిలో కాకుండామరో భూమిలో సాగు చేస్తున్న రైతులు
తాటిపర్తి గ్రామంలో సమస్య వెలుగులోకి
పరిష్కారం దిశగా అధికారుల కసరత్తు
యాచారం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రైతులు ఏళ్ల తరబడి ఒక సర్వే నెంబర్‌కు బదులు మరో సర్వే నెంబర్‌లోని భూమిని సాగు చేసుకుంటున్న విషయం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 70 కుటుంబాలు సర్వే నెంబర్ 104లోని 145 ఎకరాల భూమిని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాయి. దీనిని ఫార్మాసిటీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు సర్వే చేయడానికి రాగా, రైతులు అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి ఇవే భూముల్లో సాగు చేసుకుంటున్నామని, తమ పట్టా భూముల జోలికి రావొద్దని అధికారులను కోరారు. ఈ భూముల రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సర్వే నెంబర్ 109కి బదులు సర్వే నెంబర్ 104లోని భూమిలో రైతులు సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలిసి సదరు రైతులు అవాక్కయ్యారు. చాలా ఏళ్ల క్రితం వీరు గ్రామానికి చెందిన ఇతర రైతుల వద్ద ఈ భూములు కొనుగోలు చేశారు. భూవిక్రయదారులకు సర్వే నెంబర్ 104తో పాటు 109పై కూడా హక్కులుండడంతో అప్పట్లోవారు చూపిన భూములనే సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు అధికారుల సర్వేలో అసలు విషయం బయటపడింది. సర్వే నెంబర్ 109లో ఉన్న 145 ఎకరాలను రైతులకు కేటాయించడానికి రెవెన్యూ అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సర్వే నెంబర్ 104లో ఏయే రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో.. అంతే భూమిని సర్వే నెంబర్ 109లో కేటాయించి సమస్యను పరిష్కరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.