Child Health: ఐదేళ్లలోపు చిన్నారులపై సర్వే
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:15 AM
ఐదేళ్లలోపు చిన్నారుల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం...
వారి ఆరోగ్య సమస్యలు గుర్తించేందుకు ప్రత్యేక యాప్
ఆర్బీఎస్కే బృందాల ఆధ్వర్యంలో 42 ప్రశ్నలతో వివరాల సేకరణ
వికారాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు చిన్నారుల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తెచ్చింది. దీని ద్వారా 0-5 వయసు పిల్లల ఆరోగ్యంపై సర్వే చేస్తారు. ఇందుకోసం వికారాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలే లక్ష్యంగా ఈ సర్వే చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం (ఆర్బీఎస్కే) నిర్వహించే బృందాలను రంగంలోకి దింపారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా ఆర్బీఎస్కే నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వజాతీయ ఆరోగ్య మిషన్‌లో ఆర్బీఎస్కే ఒక ప్రోగ్రామ్. ఇది ప్రధానంగా పిల్లల్లో తలెత్తే నాలుగు రకాల డీ(డిఫెక్ట్స్ ఎట్ బర్త్, డెఫిషియెన్సీస్, డిసీజెస్, డెవలె్‌పమెంట్ డిలే్‌స)లను పరీక్షిస్తుంది. ఆర్బీఎస్కే బృందం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య సమస్యలను అంగన్వాడీ టీచర్లు, అవసరమైతే పిల్లల తల్లులను కూడా అడిగి తెలుసుకుంటాయి. ఇందుకోసం మొత్తం 42 ప్రశ్నలను రూపొందించారు. ఇవన్నీ యాప్‌లో ఉంటాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. చిన్నారి పేరు, ఊరు, ఆధార్, తల్లిదండ్రుల పేర్లను అందులో నమోదు చేస్తారు. అనంతరం అన్ని ప్రశ్నలను అంగన్వాడీ టీచర్, తల్లిని అడిగి తెలుసుకుంటారు. చిన్నారులు ఏం తింటున్నారు? ఎలా తింటున్నారు? వారి ప్రవర్తన ఎలా ఉంది? చెప్పేది సరిగ్గా వింటున్నారా? అడగ్గానే సమాధానం చెబుతున్నారా? ఆరోగ్య పరంగా ఏమైనా సమస్యలు వస్తున్నాయా? ఎంత చురుగ్గా ఉంటున్నారు? వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఇతర పిల్లలతో ఎలా ఉంటున్నారు? నిద్ర సరిగ్గా పోతున్నారా? వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉన్నారా? వంటి ప్రశ్నలు అడిగి జవాబులను యాప్‌లో నమోదు చేస్తారు. దీని ద్వారా పిల్లల ఆరోగ్య, మానసిక పరిస్థితిపై ఒక నిర్ధారణకు వస్తారు. శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగాలేని పిల్లలను హైదరాబాద్‌కు తీసుకువస్తారు. ఇక్కడ వైద్యులు వారి పరిస్థితిని బట్టి వైద్య పరీక్షలు చేస్తారు. ఉదాహరణకు ఒక చిన్నారికి వినికిడి సమస్య ఉన్నట్లు గుర్తిస్తే.. ఈఎన్‌టీ వైద్యులకు సిఫారసు చేస్తారు. అక్కడ మరిన్ని పరీక్షలు చేశాక అవసరమైన కాంక్లియర్ సర్జరీలు లాంటివి చేస్తారు. ఆటిజం లాంటి సమస్య ఉన్నట్లు గుర్తిస్తే అందుకు తగ్గట్లుగా వైద్య సేవలందిస్తారు. చిన్న సమస్యలుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, ఏఎన్‌ఎమ్‌లు, ఆశాల పర్యవేక్షణలో పరిష్కరిస్తారు. ఇలా ఐదేళ్లలోపే పిల్లల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య సేవలను అందించనున్నారు.