kumaram bheem asifabad- తరగతి గదుల్లో నిఘా
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:30 PM
లెక్చరర్లు క్లాస్‌కు వచ్చారా? పాఠాలు చెబుతున్నా రా? క్లాస్‌లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అని పర్యవేక్షించేందుకు ఇంటర్ విద్యాశాఖ సీసీ కెమెరాలు వినియోగించనున్నది. జూనియర్ కళాశాలల తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
- ఒక్కో జూనియర్ కళాశాలకు 14 నుంచి 16 వరకు కేటాయింపు
- విద్యార్థుల హాజరు, ఫలితాలు మెరుగుపడే అవకాశం
లెక్చరర్లు క్లాస్‌కు వచ్చారా? పాఠాలు చెబుతున్నా రా? క్లాస్‌లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అని పర్యవేక్షించేందుకు ఇంటర్ విద్యాశాఖ సీసీ కెమెరాలు వినియోగించనున్నది. జూనియర్ కళాశాలల తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
బెజ్జూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కాలశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్‌లు, స్టాప్‌గది, ప్రిన్సిపాల్ గది, వరండా కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరలు బిగించారు. ఒక్కో కళాశాలలో 14 నుంచి 16 వరకు, అవసరమైన చోట 20వరకు సీసీ కెమెరాలు అమర్చారు. దీంతో ఇక జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 11ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ పూర్తి కావచ్చింది.
- గతంతో పరీక్షల సమయంలో..
గతంలో కేవలం ఇంటర్మీడియెట్ పరీక్షల సమయంలో మాత్రమే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాటిని తీసేసేవారు. ఈ విద్యా సంవత్సరం 2025-26నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరు, అధ్యాపకుల విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ప్రతీ తరగతి గదిలో నిఘా ఉంటుంది. అకడామిక్ మానిటరింగ్ కమిటీలు, డీఐఈవోలతో పాటు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ద్వారా సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు. ప్రతీ కళాశాలల్లో అధ్యాపకులు విద్యార్థులకు సరైన రీతిలో పాఠాలు బోధిస్తున్నారా లేదా అన్నది కూడా ఇట్టే తెలిసి పోతుంది. గతంలో కళాశాలలకు వచ్చే అధ్యాపకులు కొన్నిచోట్ల కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అదే విధంగా ప్రతి అధ్యాపకుడు క్రమం తప్పకుండా విధులకు హాజరు కావడమే కాకుండా పాఠాలు కూడా సక్రమంగా బోధించేందుకు ఉపయోగపడుతుందని పలువురు విద్యా నిపుణులు తెలుపుతున్నారు.
- హాజరు శాతం పెంచేందుకు..
గతంలో ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోయేవారు. దీంతో హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండేది. ఈ క్రమంలో సరైన విద్యాబోధన, పరీక్షల ఫలితాలు మెరుగుపడేలా ఉన్నతాధికారులు ఇంటర్‌లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో బాగంగా తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక నుంచి అధ్యాపకులు కూడా సక్రమంగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు అధ్యాపకుడు ఒక రోజు రాకుంటే ఆ పీరియడ్‌లో వేరే అధ్యాపకుడు బోధించాల్సి ఉంటుంది.
- సంబంధిత వెబ్‌సెట్ ద్వారా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 15నుంచి ఫిజిక్స్‌వాలా ద్వారా సంబంధిత వెబ్‌సెట్ ద్వారా జేఈఈ, ఐఐటీ, ఎప్‌సెట్, నీట్‌లాంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఫిజిక్స్‌వాలా శిక్షణకు సంబంధించిన టైం టేబుల్‌ను డీఐఈవోల ద్వారా ఆయా జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించారు. ప్రతిరోజూ ఏదో ఒక సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం వివిద కళాశాలల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ కళాశాలకు ఇన్‌ప్లాంట్స్ టేబుల్స్ కూడా రానున్నాయి. పెద్ద కంప్యూటర్ మానిటర్‌లో వెబ్‌సెట్ ద్వారా వీడియోలను విద్యార్థులు తిలకించనున్నారు. ఫిజిక్స్‌వాలా శిక్షణను విద్యార్థులు సరిగా వినియోగించుకుంటున్నారా లేదా అనేది హైదరాబాద్ నుంచి సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణకు ప్రతీ జిల్లాకు ఒకరి చొప్పున ఇన్‌చార్జీలను నియమించినట్టు తెలుస్తోంది. అలాగే డీఐఈవోలు కూడా పర్యవేక్షిస్తారు. అందుకు డీఐఈవో కార్యాలయాల్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించిన డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా టెక్నిషియన్‌ను కూడా నియమించారు. దీంతో ఇక కళాశాలల్లో ఏం జరిగినా సమాచారమంతా కమాండ్ కంట్రోల్‌కు తెలిసిపోతుంది.
నిరంతర పర్యవేక్షణ..
- కళ్యాణి, డీఐఈవో, ఆసిఫాబాద్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతర పర్యవేక్షణతో పారదర్శకత పెరగనుంది. అధ్యాపకుల బోధన, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ ఉండడంతో విద్యాబోధన మెరుగుపడనుంది. విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు అధ్యాపకుల విద్యాబోధనతో మెరుగై ఫలితాలు సాధించే అవకాశం ఉంది. జిల్లాల్లో డీఐఈవోలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు సూచనలు చేస్తారు.