Patient Family Protests: అవసరమైన పరికరాలు లేవని ఆపరేషన్‌ను మధ్యలో ఆపేసిన డాక్టర్లు
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:12 AM
వైద్యం చేసి ప్రాణం పోయాల్సిన వైద్యులే.. అవసరమైన పరికరాలు అందుబాటులో లేవంటూ.. ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు...
ఆందోళనకు దిగిన రోగి కుటుంబ సభ్యులు
మేడ్చల్ టౌన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైద్యం చేసి ప్రాణం పోయాల్సిన వైద్యులే.. అవసరమైన పరికరాలు అందుబాటులో లేవంటూ.. ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేడ్చల్‌లోని ఘన్‌పూర్ మెడిసిటీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన పుష్పలత అనే మహిళ కొద్దిరోజులుగా హెర్నియాతో బాధపడుతోంది. నాలుగురోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి.. శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో పుష్పలతను 17వ తేదీన ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ చేశారు. గురువారం ఉదయం సర్జరీ చేయడానికి ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన సిబ్బంది.. సాయంత్రం వరకూ తిరిగి తీసుకురాలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి డాక్టర్లను నిలదీయగా.. అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సర్జరీని మధ్యలోనే ఆపేసి కుట్లు వేసి పేషంట్‌ను అబ్జర్వేషన్‌లో పెట్టామని చల్లగా చెప్పారు. పేషంట్‌ను వెంటనే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పుష్పలత కుటుంబసభ్యులు డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని వైద్యులు నచ్చజెప్పడంతో అప్పటికి శాంతించారు. అయితే.. శుక్రవారం ఉదయం వరకూ ఆస్పత్రి వైద్యులు ఏ విషయం చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ డాక్టర్లను నిలదీశారు. పేషంట్‌ను వెంటనే నిమ్స్ లేదా ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వారు తేల్చి చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పేషంట్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వెలిబుచ్చారు.