Share News

Suravaram Pratapa Reddy University: రికార్డింగ్‌ కల..కళ!

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:05 AM

ఆడియో గీతాల రూపకల్పన, వీడియోల చిత్రీకరణ ద్వారా అభిమానగణాన్ని సంపాదించుకోవాలనుకునే ఔత్సాహిక కళాకారులకు మహదవకాశం..

Suravaram Pratapa Reddy University: రికార్డింగ్‌ కల..కళ!

  • రూ.250కే ఆడియో, రూ.1250కే వీడియో గంటపాటు రికార్డింగ్‌ చేసుకోవొచ్చు

  • గ్రీన్‌మ్యాట్‌తో తెలుగు వర్సిటీలో స్టూడియోల ఏర్పాటు

  • ఔత్సాహిక కళాకారులకు గొప్ప అవకాశం

హైదరాబాద్‌ సిటీ, జూలై16 (ఆంధ్రజ్యోతి): ఆడియో గీతాల రూపకల్పన, వీడియోల చిత్రీకరణ ద్వారా అభిమానగణాన్ని సంపాదించుకోవాలనుకునే ఔత్సాహిక కళాకారులకు మహదవకాశం! ఆడియో రికార్డింగ్‌లు, డబ్బింగ్‌లు, సినిమాలు, నాటికలు, నృత్యాలు, ఇంటర్వ్యూలు, ఉపన్యాసాల కోసం ఖరీదైన స్టూడియోలకు వెళ్లి జేబు ఖాళీ చేసుకోవాల్సిన అగత్యం లేదు. నామమాత్రపు ఖర్చుతో ఈ రికార్డింగ్‌లు పూర్తి చేసుకునే అవకాశాన్ని నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కల్పిస్తోంది. ఈ మేరకు హై రెసెల్యూషన్‌ కెమెరాలు, టెలిప్రాంప్టర్లు, ఎడిటింగ్‌ కోసం అధునాతన సాంకేతిక వ్యవస్థతో పూర్తిస్థాయి గ్రీన్‌మ్యాట్‌ కలిగిన రెండు స్టూడియోలను విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది. యూజీసీ నిధులతో వీటిని ఏర్పాటు చేశారు. రూ.1250 చెల్లిస్తే గంటపాటు వీడియోలు చిత్రీకరించుకోవొచ్చు. అలాగే రూ.250 చెల్లిస్తే గంటపాటు ఆడియో రికార్డింగ్‌ చేసుకోవొచ్చు. రికార్డింగ్‌ల కోసం అవసరమైన సాంకేతిక నిపుణులూ అక్కడ అందుబాటులో ఉన్నారు. సాహిత్యాభిమానులు, జానపద కళాకారులు తమ పాటలను, కవితలను రికార్డింగ్‌ చేసుకునేందుకు.. రికార్డింగుల కోసం భారీస్థాయిలో వెచ్చించలేకపోతున్న సినీ కళాకారులకు ఈ వేదిక చక్కని అవకాశం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుకింగ్‌ చేసుకోవాలనే వారు 72880 71111 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 05:05 AM