Chada Venkata Reddy: ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టుసుమోటోగా విచారణ జరపాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:42 AM
ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి కోరారు.
ఆపరేషన్ కగార్ ఓ పచ్చి బూటకం
సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపణ
భద్రాచలం, కొత్తగూడెం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీపీఐ శతవసంత ఉత్సవాల ప్రచార జాత ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ కగార్ ఓ పచ్చి బూటకమని, ఎన్‌కౌంటర్ల పేరు తో మావోయిస్టులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి హతమారుస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు శాంతి చర్చలకు రావాలని ఆహ్వానిస్తూనే మురోవైపు వరుస ఎన్‌కౌంటర్లు చేస్తున్నారన్నారు. సభలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరుల స్థూపం వద్ద పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు.
ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేయాలి
ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేయాలని, దండకారణ్యం క్యాంపుల్లో ఉన్న సాయుధ బలగాలను ఉపసంహరించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదర్‌గూడలోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు, సంయుక్త కార్యదర్శి మదన కుమారస్వామిలతో కలిసి ఆయన మాట్లాడారు. హిడ్మాతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని, ఇందులో పాల్గొన్న పోలీసులందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.