Share News

MLAs Disqualification: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై పిటిషన్లు...నేడు సుప్రీంలో విచారణ!

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:26 AM

తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. బీఆర్‌ఎస్‌ బీ ఫారంతో, కారు గుర్తుపై గెలిచిన శాసనసభ్యులు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌....

MLAs Disqualification: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై పిటిషన్లు...నేడు సుప్రీంలో విచారణ!

  • నేటిలోగా తేల్చాలని గతంలోనే స్పీకర్‌కు ఆదేశం

  • బుధవారమే ఐదుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్న స్పీకర్‌

  • మిగతా ఐదుగురిపై మరింత గడువు కోరే అవకాశం

న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. బీఆర్‌ఎస్‌ బీ ఫారంతో, కారు గుర్తుపై గెలిచిన శాసనసభ్యులు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని, స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదని పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(సివిల్‌) దాఖలు చేశారు. అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివా్‌సరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలెయాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్‌ కుమార్‌లు పార్టీ ఫిరాయించారని కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, చింత ప్రభాకర్‌, కల్వకుంట్ల సంజయ్‌ సుప్రీంలో రిట్‌ పిటిషన్‌(సివిల్‌) వేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్‌రెడ్డి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(సివిల్‌) దాఖలు చేశారు. దానం నాగేందర్‌ని ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి వీలైనంత త్వరగా లేదంటే మూడు నెలలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత స్పీకర్‌ సుప్రీంకోర్టులో సమయం కోరగా, ఉద్దేశ పూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ క్రమంలో రోజువారీగా విచారించాలని, లేదంటే న్యూఇయర్‌ ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్‌ తేల్చుకోవాలని అప్పటి సీజేఐ, జస్టిస్‌ బీఆర్‌ గవాయి తీవ్రంగా హెచ్చరించారు. డిసెంబర్‌ 19 లోపు 10 మంది ఎమ్మెల్యేలపై విచారణను ముగించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని చెబుతూ ఆ ఐదు పిటిషన్లను స్పీకర్‌ కొట్టివేశారు. మరో ఐదుగురికి సంబంధించిన అంశం పెండింగ్‌లోనే ఉంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్‌ స్పీకర్‌ నోటీసులకు సమాధానమే ఇవ్వలేదు. కడియం శ్రీహరి మాత్రం బుధవారమే తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఫిరాయింపు వ్యవహారంపై శుక్రవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీ్‌హలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ముగిసిందని, మరో ఐదుగురి పిటిషన్లపై విచారించేందుకు మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్‌ కోరే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలు సహా ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని నివేదించే అవకాశముంది. గతంలోనే ఇదే చివరి అవకాశమని చెప్పిన సుప్రీంకోర్టు ఈ సారి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. గతంలో తీవ్రంగా హెచ్చరించిన సీజేఐ గవాయి పదవీ విరమణ చేశారు.

Updated Date - Dec 19 , 2025 | 04:26 AM