Supreme Court: ఆ 23 గిరిజన గ్రామాలేనన్న తీర్పుపై స్టే
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:37 AM
ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు గిరిజన గ్రామాలేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక..
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆ గ్రామాల్లో స్థానిక ఎన్నికలకు బ్రేక్!
న్యూఢిల్లీ/ములుగు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు గిరిజన గ్రామాలేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆ 23 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామాలపై గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు గిరిజనులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాలేనని 2023 జూలై 5న తీర్పు వెలువడింది. కొందరు గిరిజనేతరులు హైకోర్టు తీర్పును అదే ఏడాది ఆగస్టు 24న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున వివేక్ తంఖా, విష్ణువర్దన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ, గౌరవ్ అగర్వాల్, ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్, ఏవోఆర్ మోహిత్‌రావు హాజరయ్యారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు లేవని వివేక్ తంఖా వాదనలు వినిపించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలుపుతూ ఆ గ్రామాలను రాష్ట్రపతి నోటిఫై చేశారని తెలిపారు. అయితే ఈ ప్రక్రియకు కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఈ మధ్యలో ఆ గ్రామాలను పాల్వంచ తాలూకా నుంచి ములుగు తాలూకాలో కలిపారని పేర్కొన్నారు. ఇది కేవలం పాలనాపరమైన తప్పేనని, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకం కాదని, అవి ముమ్మాటికీ గిరిజన గ్రామాలేనని తెలిపారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం.. రెండు నెలల తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోందని, ఆ 23 గ్రామాల్లోనూ రిజర్వేషన్ల ప్రకారమే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని వివేక్ తంఖా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల అత్యవసరంగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో తదుపరి విచారణ వరకు ఆ 23 గ్రామాలు గిరిజన గ్రామాలేనని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది.