Share News

Government Forest Land: 102 ఎకరాలు అటవీ శాఖవే!

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:30 AM

రూ.వేల కోట్ల విలువ చేసే 102 ఎకరాల అటవీ భూమి విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సంచలన తీర్పునిచ్చింది.

Government Forest Land: 102 ఎకరాలు అటవీ శాఖవే!

  • సాగర్‌ రోడ్డులో ఆ భూమి ప్రైవేటు ఆస్తి కాదు.. రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా సుప్రీం సంచలన తీర్పు

  • జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరం.. 1953లోనే రెవెన్యూ నుంచి అటవీ శాఖకు బదలీ

  • ఎస్టేట్‌ అధికారి పేరుతో 1954లో తెచ్చిన పత్రాలు చెల్లవు.. అటవీ అధికారుల అలసత్వంతో ఈ పరిస్థితి

  • ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే.. ఎనిమిది వారాల్లో రిజర్వు ఫారెస్టుగా ప్రకటించండి

  • సీఎ్‌సకు సుప్రీం ఆదేశం.. 20 ఏళ్ల వివాదానికి తెర.. సుప్రీం తీర్పుతో వేల కోట్ల భూమి సర్కారు సొంతం

న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రూ.వేల కోట్ల విలువ చేసే 102 ఎకరాల అటవీ భూమి విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సంచలన తీర్పునిచ్చింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నుంచి నాగార్జునసాగర్‌ వెళ్లే రోడ్డులో ప్రధాన రహదారిపై ఉన్న ఈ భూమి తమ ప్రైవేటు ఆస్తి అని కొందరు చేసిన వాదనను తోసిపుచ్చింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం సాహెబ్‌నగర్‌ కలాన్‌ రెవెన్యూ పరిధిలోని 201/1 సర్వే నంబర్‌లో ఉన్న ఈ భూమి గుర్రంగూడ రిజర్వు ఫారెస్టులో భాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 102 ఎకరాలను రిజర్వు ఫారెస్టుగా ప్రకటిస్తూ ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో ఉన్న 102 ఎకరాల భూమి తమదేనని సాలార్‌జంగ్‌ వారసులు న్యాయపోరాటం చేస్తున్నారు. అది ప్రైవేటు భూమి(అరాజీ - మక్తా) అనే వాదనను తెర మీదకు తెచ్చారు. వీరి వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు గతంలో వీరికి అనుకూలంగా ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కనపెట్టింది. జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. మీర్‌ జాఫర్‌ అలీ ఖాన్‌ (సాలార్‌జంగ్‌-3 వారసులు) తదితరులు 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా ఇది తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వాదించారు. 2014లో ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్‌ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన తీర్పులో అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. 1949లో జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరమయ్యాయని ప్రకటించింది. 1953 లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని గుర్తు చేసింది. అప్పటి నుంచి అటవీశాఖ ఆధీనంలోనే ఉందని పేర్కొంది. సాలార్‌జంగ్‌ వారసులు చూపిస్తున్న 1954 నాటి జాగీర్‌ నిర్వాహకుడి లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని అభిప్రాయపడింది. జిరాక్సు పత్రాలను ఆధారంగా చేసుకుని, వాస్తవ రికార్డులను సరిగా పరిశీలించకుండానే కింది కోర్టులు తీర్పులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.


ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత పూర్తిగా అధికారులదేనని సుప్రీంకోర్టు హితబోధ చేసింది. సుధీర్ఘకాలంగా ఆ భూమిపై వివాదాలు కొనసాగే పరిస్థితి కల్పించిన అధికారుల అలసత్వంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సమయానికి తగినట్టుగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని అభిప్రాయపడింది. యాజమాన్య హక్కుల వివాదాలను తేల్చే అధికారం సివిల్‌ కోర్టులకు మాత్రమే ఉంటుందని చెప్పింది. సమ్మరీ ఎంక్వైరీ చేసే ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌కు యాజమాన్య హక్కుల వివాదాలు తేల్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌ తన అధికార పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఈ 102 ఎకరాల భూమిని ‘రిజర్వ్‌ ఫారె్‌స్ట’గా ప్రకటించాలని చెప్పింది. తెలంగాణ ఫారెస్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్‌ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అనంతరం తమ ఆదేశాలను అమలు చేసినట్లుగా నివేదికను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని తీర్పులో పేర్కొంది. ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్‌ నయీమతుల్లా షుస్ర్తీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను(సివిల్‌ అప్పీల్‌ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చినందున, ఇతరుల వాదనలకు అవకాశం లేదని తేల్చిచెప్పింది.

ఆ భూమి మాదే... సాహెబ్‌నగర్‌ దళితులు

సుప్రీంకోర్టు అటవీ భూమిగా ప్రకటించిన 102 ఎకరాలను 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తమకు లావణి పట్టాలు ఇచ్చారని సాహెబ్‌నగర్‌కు చెందిన దళిత కుటుంబాలు చెబుతున్నాయి. 39 మందికి రెండున్నర ఎకరాల చొప్పున ఇచ్చారని, సాగు చేయలేక వదిలేసినపుడు గుర్రంగూడ ఫారెస్టుకు అప్పగించారని చెప్పారు. తర్వాత భూముల్లోకి రైతులు వెళితే కేసులు కూడా పెట్టారన్నారు. నాగార్జునసాగర్‌ జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో ఆక్రమణకు గురై కొన్ని వ్యాపార సముదాయాలు వెలిసినట్లు స్థానికులు తెలిపారు. వందల కోట్ల విలువ చేసే ఈ భూములను కొందరు ఎలాంటి పత్రాలు లేకుండానే ఆక్రమించుకుని భవనాలు నిర్మించినట్లు తెలుస్తుంది. మరోపక్క కేసును సమర్థంగా వాదించిన సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైధ్యనాధన్‌, జస్టిస్‌ కోదండరాం(రిటైర్డ్‌), అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్యర్య బాటి, అడ్వొకేట్‌కరణం శ్రవణ్‌కుమార్‌లకు జిల్లా అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. సుదీర్ఘ పోరాటం మూలంగానే కీలక తీర్పు సాధ్యమయిందని జిల్లా అటవీ అధికారి రోహిత్‌ గోపిడి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Dec 19 , 2025 | 04:30 AM