Supreme Court: హైకోర్టులోనే తేల్చుకోండి
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:15 AM
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుతం కల్పించుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం...
అక్కడ విచారణలో ఉండగా కల్పించుకోలేం
బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు
హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరణ
రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని స్పష్టీకరణ
శాస్త్రీయంగా సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశామని వివరించిన రాష్ట్ర ప్రభుత్వం
గతంలోని సుప్రీం తీర్పులకు అనుగుణంగానే వ్యవహరించామని వాదనలు
ఈ అంశాలతో ఏకీభవించని ధర్మాసనం
పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచన
న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుతం కల్పించుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా తాము విచారణకు స్వీకరించలేమని, దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ)ని జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహ్రాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో హైకోర్టు విచారణ ప్రభావితం కావొద్దని, ఉచితానుచితాలపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
గత సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే..
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ దాఖలు చేసింది. హైకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఎన్నికలు నోటిఫై చేయడానికి ముందే రిజర్వేషన్లపై చట్టం ఎందుకు తీసుకురాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని సింఘ్వి వివరించారు. గవర్నర్ నిర్ణీతకాలంలో ఆమోదించకుంటే అనుమతి ఇచ్చినట్టే భావించాలన్న ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడినట్టేనని భావించామని తెలిపారు. అయితే మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని సుప్రీం మార్గదర్శకాలు ఉన్నాయి కదా అని ధర్మాసనం ప్రస్తావించగా.. కచ్చితమైన డాటా ఉంటే పరిమితి దాటవచ్చని కూడా సుప్రీంకోర్టు పేర్కొందని సింఘ్వి వివరించారు. సుప్రీం ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలను సంతృప్తి పరిచామని.. ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక సర్వే చేశామని తెలిపారు. 50శాతం పరిమితి అనేది మార్చలేనిది కాదని, సరైన, శాస్త్రీయమైన డాటా ఉంటే మార్చవచ్చని వాదించారు. వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంపై ఎలాంటి వాదనలు వినకుండా స్టే ఎలా విధిస్తారని, ఆ స్టే విధించడానికి హైకోర్టు ఎలాంటి కారణాలు కూడా చెప్పలేదని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. మొత్తం రిజర్వేషన్లు 67శాతానికి పెంచే నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు సమర్థించాయని, శాసనసభ కూడా ఆమోదించిందని తెలిపారు. మరోవైపు ప్రతివాది మధుసూదన్‌రెడ్డి తరఫున గోపాల్ శంకర్‌నారాయణ్ వాదనలు వినిపించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. పరిమితిపై మినహాయింపులు కేవలం ఎస్టీలకే వర్తిస్తాయని కృష్ణమూర్తి కేసులో రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని వివరించారు. సుమారు 36 నిమిషాల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సాధారణ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50శాతం పరిమితికి మించరాదని స్పష్టం చేసింది.