Share News

Supreme Court Refuses: ఏపీకి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులివ్వలేం

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:57 AM

ఆంధ్రప్రదేశ్‌ జెన్‌ కోకు విద్యుత్‌ బకాయిలను తెలంగాణ చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది...

Supreme Court Refuses: ఏపీకి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులివ్వలేం

  • సమగ్ర విచారణ అవసరం: సుప్రీంకోర్టు

  • సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణకు ఊరట

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ జెన్‌ కోకు విద్యుత్‌ బకాయిలను తెలంగాణ చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిల వివాదంలో సమగ్ర విచారణ అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తెలంగాణ డిస్కంలకు ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిల అంశంలో వివాదం ఏర్పడింది. తమకు తెలంగాణ రూ. వేల కోట్లు బకాయి పడిందని, చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేస్తోందని, తక్షణమే తమకు బకాయిలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ జెన్‌కో కేంద్రాన్ని ఆశ్రయించింది. ఏపీ విజ్ఞప్తి మేరకు రూ.3756 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. కేంద్రం ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. పీపీఏల్లో పేర్కొన్న ఫోరానికి వెళ్లకుండా ఏపీ జెన్‌కో నేరుగా కేంద్రాన్ని ఆశ్రయించడం, తెలంగాణ డిస్కంల అభిప్రాయాలు చెప్పే అవకాశమివ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్‌ 92 కింద కేంద్రం జారీచేసిన ఈ ఆదేశాలు చెల్లవని పేర్కొంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏల) ప్రకారం మధ్యవర్తిత్వం ద్వారా ఇరు రాష్ట్రాల విద్యుత్తు సంస్థలు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పును గతేడాది నవంబరులో ఏపీ జెన్‌కో సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ మంగళవారం సీజేఐ, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ జెన్‌కో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాము విద్యుత్‌ సరఫరా చేశామన్నది అందరికీ తెలిసిన విషయమేనని, అలాంటప్పుడు తమకు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ డిస్కంలపై ఉంటుందని తెలిపారు. బకాయిలు మొత్తం కాకపోయినా, కనీసం వివాదం లేని మొత్తాన్ని అయినా తెలంగాణ డిస్కంలు వెంటనే చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనం ఎదుట విజ్ఞప్తి చేశారు. అయితే, తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. విషయ తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ అంశంలో సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయ పడింది. డిసెంబరు మొదటి వారంలో సమగ్రంగా విచారణ చేపడతామని, అ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

Updated Date - Sep 17 , 2025 | 05:57 AM