Share News

Supreme Court: కేంద్ర సర్వీసుల్లోని వారి పిల్లలకూ స్థానికత వర్తింపజేయాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:41 AM

తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వర్తింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర సర్వీసుల్లో పనిచేసే వారి పిల్లలకూ స్థానికత వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో...

Supreme Court: కేంద్ర సర్వీసుల్లోని వారి పిల్లలకూ స్థానికత వర్తింపజేయాలి

  • తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వర్తింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర సర్వీసుల్లో పనిచేసే వారి పిల్లలకూ స్థానికత వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మంగళవారం ఈ అంశం చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ముందువచ్చింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక కోటాకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనందున దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ధర్మాసనాన్ని పిటిషనర్‌ న్యాయవాది కోరారు. ‘‘ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల ఉద్యోగుల పిల్లలను స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే ఈ ప్రయోజనం కల్పిస్తోంది. కేంద్ర సర్వీసుల్లోని వారి పిల్లలను పరిగణనలోకి తీసుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ గవాయ్‌.. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున, తక్షణమే స్పష్టత కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామని పిటిషనర్‌ న్యాయవాది వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

Updated Date - Sep 17 , 2025 | 05:41 AM