SIB chief Prabhakar Rao: పోలీసుల ముందు లొంగిపొండి
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:14 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, ప్రత్యేక నిఘా విభాగం .....
నేటి ఉదయం 11 గంటలకల్లా సరెండర్ కావాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావును ఆదేశించిన సుప్రీం కోర్టు
కస్టోడియల్ విచారణకు పోలీసులకు అనుమతి
19న తదుపరి విచారణ
హార్డ్ డిస్కులు తొలగించమని ఎవరు ఆదేశించారు?
విచారణ సందర్భంగా జస్టిస్ మహదేవన్ ప్రశ్న
న్యూఢిల్లీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, ప్రత్యేక నిఘా విభాగం (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి, ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. బీఆర్‌ఎస్ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారత్‌కు తిరిగొస్తానని పిటిషన్ దాఖలు చేయగా.. తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి తిరిగొచ్చి ‘సిట్’ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌ను వరుసగా మూడోరోజు గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, ప్రభాకర్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ హాజరయ్యారు. విచారణ సందర్భంగా జస్టిస్ మహదేవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘మీరు (ప్రభాకర్‌రావు) చట్టానికి లోబడే పనిచేశానని చెబుతున్నారు. దాదాపు 36 హార్డ్ డిస్కులను మీరు తొలగించారు. అలా చేయమని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పడం లేదు? పాస్‌వర్డ్ ఇవ్వమని మిమ్మల్ని అడిగిన ప్రతిసారీ ‘గుర్తులేదు.. మర్చిపోయాన’ని ఎందుకు చెబుతున్నారు? ఆ తర్వాత అనూహ్యంగా మీకు పాస్‌వర్డ్ గుర్తొచ్చింది. కానీ అందులో ఎటువంటి సమాచారం లేదు. హార్డ్ డిస్కులను తొలగించడం, అందులో సమాచారాన్ని డిలీట్ చేయడం, అడిగితే గుర్తులేదని చెప్పడం నేరం కిందకు రాదా?’’ అని ప్రశ్నించారు.
ఇంతలో అఫిడవిట్‌లో అన్ని విషయాలు పొందుపరిచామని చెబుతూ కేసులోని ఇతర అంశాలను ప్రస్తావించేందుకు రంజిత్ కుమార్ ప్రయత్నించగా జస్టిస్ మహదేవన్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. హార్డ్ డిస్కుల్లో డేటా డిలీట్ చెయ్యమని మీకు ఎవరైనా లిఖితపూర్వకంగా అధికారిక ఆదేశాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒకవేళ హార్డ్ డిస్కులను తొలగించమని ఆదేశాలిచ్చినా అందులోని డేటాను డిలీట్ చేయమని అర్థం కాదు కదా?’’ అని అన్నారు. అటువంటి ఆదేశాలేమైనా ఉంటే అవి కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 2023 డిసెంబరు 2కు ముందు రివ్యూ కమిటీ ఉందని, ఆ కమిటీ దగ్గరే ఎవరు ఆదేశాలిచ్చారనే సమాచారం ఉంటుందన్నారు. అందుకే ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హార్డ్ డిస్కుల ధ్వంసం, డేటాను డిలీట్ చేశామనే ఆరోపణల్లో వాస్తవం లేదని రంజిత్‌కుమార్ వాదించగా.. అలాగైతే ఆ డేటా ఎక్కడుందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు.
సమీక్ష కమిటీ అనుమతితోనే ట్యాపింగ్..
ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా కట్టుకథ అని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభాకర్‌రావును ఈ కేసులో ఇరికించారని రంజిత్ కుమార్ వాదించారు. ఇది నిరాధారం కాబట్టే ఇతర నిందితులు (ఏ2 నుంచి ఏ6 వరకు) ప్రణీత్‌రావు, భుజంగరావు, మేకల తిరుపతన్న, రాధాకిషన్‌రావు, శ్రవణ్ కుమార్‌కు ముందస్తు బెయిల్ లభించిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేశారని, వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేయడం ఆ విభాగం బాధ్యతని చెప్పారు. ఆయన ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలు మాత్రమే నిర్వర్తించారన్నారు. అయితే ‘‘ఆ పేరుతో రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్లను, చివరకు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశార’’ని తుషార్ మెహతా వాదించారు. న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని రంజిత్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జీఏడీ కార్యదర్శి, న్యాయ కార్యదర్శితో కూడిన ఎపెక్స్ కమిటీ రెండు నెలలకు ఒకసారి వామపక్ష తీవ్రవాదం అంశంపై సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు.
2023 సెప్టెంబరు 27 నుంచి నవంబరు 30 వరకు ఈ కమిటీ చేసిన సమీక్షలో నిబంధనలకు లోబడే దేశ వ్యతిరేక, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసినట్టు తేలిందని కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పటి విపక్షం(కాంగ్రెస్) ఆరోపణలు నిరాధారమని 2023 అక్టోబరు 27న కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ నివేదిక సమర్పించారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు నిబంధనల ప్రకారమే పనిచేశారని, సమీక్ష కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందన్నారు. ఉన్నతాధికారి అనిల్ కుమార్ ఆదేశాలను మాత్రమే ప్రభాకర్‌రావు పాటించారని రంజిత్‌కుమార్ వాదించారు.
విచారణకు సహకరించడం లేదు..
సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదని, ఎన్నో వాస్తవాలను వెలికితీయాల్సి ఉన్నందున తక్షణమే కస్టోడియల్ విచారణ అవసరమని సిద్ధార్థ్ లూథ్రా కోరారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరిస్తున్నారని, పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి ఇచ్చారని రంజిత్‌కుమార్ వాదించారు. రెండు డివైజ్‌ల నుంచి 19 జీబీ, 25.9 జీబీల సమాచారం పోలీసులకు లభించిందని తెలిపారు. ఒక మొబైల్‌లో అమెరికా నంబర్ వినియోగిస్తున్నందున రీసెట్ చేయడం సాధ్యం కాలేదన్నారు. దర్యాప్తు సంస్థ కస్టోడియల్ విచారణకు అడగడం సరికాదన్నారు. జస్టిస్ మహదేవన్ కలుగజేసుకుని ప్రభాకర్‌రావు సహా ఇతర నిందితులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల ఫోన్ సంభాషణలు విన్నారని, హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని తొలగించారని, మరికొన్ని హార్డ్ డిస్కులను మార్చేశారని మధ్యంతర ఆదేశాల్లో స్పష్టంగా ఉందని తెలిపారు. గృహ నిర్బంధంలో ఉంచి విచారించాలని రంజిత్‌కుమార్ కోరగా లూథ్రా అభ్యంతరం తెలిపారు. ప్రభాకర్‌రావు పోలీసు శాఖలో కీలక బాధ్యతల్లో పనిచేశారని, మరిన్ని సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు, తప్పించుకునేందుకు అవకాశముందని వాదించారు. ‘‘ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ విషయాన్ని పెండింగ్‌లో ఉంచుదాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విచారిస్తారో చెప్పండి. అయితే ప్రభాకర్‌రావుకు ఎటువంటి శారీరక హాని జరగకూడదు’’ అని జస్టిస్ నాగరత్న అన్నారు. ప్రభాకర్‌రావుకు భోజనం, మందులు ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. ఆయనను కలిసేందుకు న్యాయవాదులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం కానీ ముగించడం కానీ చేయడం లేదని స్పష్టం చేసింది.