Supreme Court Justice Gavai Retires: సంతృప్తితో వీడ్కోలు చెబుతున్నా
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:20 AM
పూర్తి సంతోషం, సంపూర్ణ సంతృప్తితో న్యాయస్థానాలను వీడుతున్నట్టు సుప్రీంకోర్టు 52వ ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు...
అంబేడ్కర్ స్ఫూర్తితోనే కర్తవ్య నిర్వహణ
సంపన్న ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండొద్దు
వీడ్కోలు సమావేశంలో జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ, నవంబరు 21: పూర్తి సంతోషం, సంపూర్ణ సంతృప్తితో న్యాయస్థానాలను వీడుతున్నట్టు సుప్రీంకోర్టు 52వ ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. శుక్రవారం చివరి పనిదినం కావడంతో ఆయన భాద్వేగానికి లోన.యి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల పాటు న్యాయ వ్యవస్థతో ఆయనకు అనుబంధం ఉంది. ఆదివారం ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సాయంత్రం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘నేను రాజ్యాంగాన్ని పట్టుదలతో చదివే విద్యార్థిని. రాజ్యాంగ విలువలైన సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభాతృత్వం నా హృదయానికి దగ్గరగా ఉంటాయి’ అని అన్నారు. తన మూలాలను గుర్తు చేసుకుంటూ మహారాష్ట్రలోని అంతగా ప్రాచుర్యంలేని లేని ప్రాంతం నుంచి వచ్చానని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరకు ఎదిగానని, తల్లిదండ్రులు నేర్పిన విలువలే తనను ఈ స్థానానికి తీసుచ్చాయని తెలిపారు. ఆ పదవిని చేపట్టిన తొలి బౌద్ధ, రెండోదళిత వ్యక్తి ఆయనే కావడం విశేషం. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ క్రీమిలేయర్ పరిధిలోకి వచ్చే ఎస్సీలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు ఉండకూడదని తీర్పు ఇచ్చారు. దీనిని ప్రస్తావిస్తూ ‘ఎస్సీలందరికీ రిజర్వేషన్ల కారణంగా వ్యవసాయదారుడి కుమారుడు ఢిల్లీలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో చదివే సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడితో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తోంది. నా వద్ద పని చేసే లా క్లర్క్.. సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు. ఎస్సీలకు లభించే సౌకర్యాలనేవీ తాను తీసుకోబోనని ఆయన చెప్పాడు. ఒక యువకుడికి అర్థమయిన విషయం రాజకీయ నాయకులకు ఎందుకు అర్థం కాదో తెలియదు’ అని అన్నారు. ఉదయం జరిగిన లాంఛనప్రాయ ధర్మాసనంలోనూ జస్టిస్ గవాయి తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 1985లో తాను లా విద్యార్థిగా కోర్టులో ప్రవేశించానని, ఇప్పుడు జస్టిస్ విద్యార్థిగా కోర్టును విడిచిపెడుతున్నానని చెప్పారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌తో తన తండ్రి చాలా సన్నిహితంగా మెలిగేవారని, అది తనపై ప్రభావం చూపిందని తెలిపారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ చూసిన నిబద్ధతే తనను మార్గదర్శనం చేసిందని అన్నారు. అందుకే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యం ఉండేలా చూసేవాడినని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ తనకు ఇష్టమైన అంశమని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడుతునే పర్యావరణం, వన్యప్రాణి రక్షణ కోసం ప్రయత్నించానని అన్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పిన సమయంలో స్వరం గద్గదమయింది. లాంఛనప్రాయ ధర్మాసనంలో ఆశీనులైన తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తన ప్రసంగంలో జస్టిస్ గవాయ్‌ను ప్రశంసించారు. ఆయన సహచరుడు మాత్రమే కాదు, సోదరుడని అన్నారు. జస్టిస్ గవాయ్ కేసులను గౌరవం, సహనంతో వినేవారని ప్రశంసించారు. యువ లాయర్లను ప్రోత్సహించేవారని చెప్పారు. జరిమానా విధిస్తానంటూ ప్రతి రోజూ న్యాయవాదులను బెదిరించేవారని, కానీ నిజానికి ఒక్క రోజు కూడా అలా చేయలేదని అన్నారు.
రాష్ట్రపతి ప్రశ్నలపై ‘స్వదేశీ భాష్యం’
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా తాత్సారం చేస్తున్న సమస్యపై రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలకు ‘స్వదేశీ భాష్యం’ చెప్పి సమాధానాలు ఇచ్చినట్టు జస్టిస్ గవాయ్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి విదేశీ కోర్టుల తీర్పును కూడా ప్రస్తావించలేదని అన్నారు.