Share News

Supreme Court: నాగారం భూముల వ్యవహారంలోఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఊరట

ABN , Publish Date - Dec 17 , 2025 | 06:05 AM

నాగారం భూదాన్‌ భూముల వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది....

Supreme Court: నాగారం భూముల వ్యవహారంలోఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఊరట

  • భూదాన్‌ భూముల విషయంలో..జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

  • హైకోర్టు తీర్పునే సమర్థించిన ధర్మాసనం

  • స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నాగారం భూదాన్‌ భూముల వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ భూముల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణాలేవీ కనిపించడం లేదని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం భూదాన్‌ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ బీర్ల మల్లేశ్‌ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూముల విక్రయాల్లో అక్రమాలు జరిగాయని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని, వాటిపై ఎలాంటి లావాదేవీలు, నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింగిల్‌ జడ్జి తీర్పును డివిజన్‌ బెంచ్‌ ఎదుట సవాల్‌ చేయగా, పిటిషనర్‌ ఆరోపణలన్నీ 181, 182 సర్వే నంబర్లలోని భూములకు సంబంధించివేనని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్‌ ఎక్కడా ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు కొనుగోలు చేసిన 194, 195 సర్వే నంబర్లలోని భూముల గురించి ప్రస్తావించలేదని పేర్కొంది. ఈ రెండు సర్వే నంబర్లలో ఉన్నవి పట్టా భూములేనని, ఇవి భూదాన్‌ భూములు కాదంటూ భూదాన్‌ బోర్డు కూడా వాటిని విడుదల చేసిందని గుర్తు చేసింది. అధికారులు కొనుగోలు చేసిన భూములపై ఎలాంటి ఆరోపణలు లేవని డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. 181, 182 సర్వే నంబర్లలో మాత్రం సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. అయితే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును బీర్ల మల్లేశ్‌ ఈ ఏడాది అక్టోబరు 15న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. మొత్తం 150 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తమకు ఎటువంటి కారణం కనిపించడం లేదంటూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Updated Date - Dec 17 , 2025 | 06:05 AM