Share News

Supreme Court Extends Prabhakar Raos Custody: ప్రభాకర్‌రావు కస్టడీ పొడిగింపు

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:07 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ను సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది.

Supreme Court Extends Prabhakar Raos Custody: ప్రభాకర్‌రావు కస్టడీ పొడిగింపు

  • మరో వారం రోజులు విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి

న్యూఢిల్లీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ను సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. ఈ నెల 25 వరకు విచారించేందుకు అనుమతినిచ్చింది. అనంతరం ఈ నెల 26న ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్‌రావుపై ఫిజికల్‌ టార్చర్‌ చేయకుండా విచారించాలన్న తమ గత ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌కు సంబంధించిన పిటిషన్‌ శుక్రవారం మరోసారి జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, ప్రభాకర్‌రావు తరఫున సీనియర్‌ న్యాయవాదులు రంజిత్‌ కుమార్‌, శేషాద్రి నాయుడు హాజరయ్యారు. తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో మరింత విచారించాల్సిన అవసరం ఉందని, ప్రభాకర్‌రావు ఏమాత్రం సహకరించడం లేదని తెలిపారు. మరో వారంపాటు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌కు అవకాశం కల్పించాలని కోరారు. గత దర్యాప్తునకు సంబంధించి స్టేటస్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ‘‘ప్రభాకర్‌రావును మరికొందరి సమక్షంలో విచారించడం ద్వారా మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. వామపక్ష తీవ్రవాదం పేరుతో కొందరు వ్యక్తులు, వారి డ్రైవర్లు, సహాయకుల నంబర్లను ట్యాప్‌ చేశారు’’ అని తుసార్‌ మెహతా అన్నారు. ఈ సమయంలో జస్టిస్‌ నాగరత్న కలగజేసుకుని.. అధికారులెవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే అమలు చేస్తారు కదా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి హైరానా ఎందుకు?

ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన కేసు ఎంతమాత్రం కాదని తుషార్‌ మెహతా అన్నారు. ఎవరైనా రాజకీయ నేత వచ్చి.. ఒక వ్యక్తిని చూపించి కాల్చమని చెబితే కాలుస్తామా? అని వాదించారు. దీంతో ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరానా పడుతోందని జస్టిస్‌ నాగరత్నఅన్నారు. ఏదైనా దాచాలని భావిస్తే తప్ప.. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరైనా మీ ఫోన్‌ వింటే ఏమవుతుంది?’ అని జస్టిస్‌ నాగరత్న సూటిగా ప్రశ్నించారు. దీనిపై తుషార్‌ మెహతా కలుగజేసుకుంటూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయరాదని పుట్టాస్వామి కేసులో 9 మంది జడ్జిల ధర్మాసనం స్పష్టంగా తెలిపిందని గుర్తుచేశారు. ‘‘ఒక వ్యక్తి మెడికల్‌, పర్సనల్‌ డేటాను అతని అనుమతి లేకుండా రికార్డు చేయడం చట్ట ప్రకారం అతిపెద్ద తప్పు. ఎవరి ఫోన్‌ను అయినా సరే అక్రమంగా ట్యాప్‌ చేయమని అదేశాలు ఇచ్చే అధికారం చివరికి రాష్ట్రపతికి కూడా లేదు. సేకరించిన డేటాను తదుపరి అధికారికి అప్పగించకుండా ధ్వంసం చేయడమంటే.. అది అతిపెద్ద నేరం కిందకు వస్తుంది’’ అని తుషార్‌ మెహతా అన్నారు. కాగా, కస్టడీలో ప్రభాకర్‌రావును ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


ప్రభాకర్‌రావును వేధించేందుకే..

‘‘ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెడుతున్నారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఏడు రోజుల్లో 97 గంటలపాటు విచారణ కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం ఏడు రోజులే కాదు.. వాళ్ల అహం సంతృప్తి చెందేవరకు కస్టడీ పొడిగించాలని కోరుతూనే ఉంటుంది. స్వీయ నేరారోపణ ప్రకటన, ఇతరులపై నేరారోపణ చేసేలా విచారణ సాగుతోంది’’ అని ధర్మాసనం దృష్టికి రంజిత్‌కుమార్‌ తీసుకెళ్లారు. ఇది పూర్తిగా వేధింపుల కోసమేనని, కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ పొడిగించేందుకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు కొనసాగిస్తూ, ‘‘ప్రభాకర్‌రావు 69 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌. క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. దర్యాప్తు పేరుతో నిర్విరామంగా కూర్చోబెడుతున్నారు. మేం ఏం చెప్పమంటే అదే చెప్పు. అలాగైతే ఈ కేసు నుంచి విముక్తి కలిగిస్తాం. లేదంటే.. ఏడేళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు కోసం సిట్‌ బృందాన్ని పెంచిందని, ఇది.. షిఫ్టుల వారీగా అధికారులు మారుతూ ప్రభాకర్‌రావును వేధించడానికేనని శేషాద్రినాయుడు అన్నారు. ఇరువైపుల వాదనల అనంతరం.. జస్టిస్‌ నాగరత్న తన తీర్పును వినిపించారు. ఈ నెల 25 వరకు కస్టోడియల్‌ విచారణకు అనుమతిస్తున్నామని తెలిపారు. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న ప్రభాకర్‌రావును విడుదల చేయాలని ఆదేశించారు. అప్పటివరకు గత ఆదేశాల మేరకే ఇంటి భోజనం, మెడిసిన్‌కు అనుమతి ఇచ్చారు.

Updated Date - Dec 20 , 2025 | 05:07 AM