Vote Note Case: ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరట
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:09 AM
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మత్తయ్యపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని..
తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం.. ఆయనపై ఎఫ్‌ఐఆర్ కొట్టేయడం సరైనదేనని స్పష్టీకరణ
రేవంత్‌రెడ్డి, సండ్రల పిటిషన్లపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మత్తయ్యపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు తనకు లంచం ఇవ్వజూపారని అప్పటి ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ఫిర్యాదు చేశారు. 2015 జూలై 28న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏసీబీ అదే ఏడాది జూలై 6న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టీఫెన్సన్ సైతం పిటిషన్ దాఖలు చేశారు. గత వారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది తీర్పును ఇచ్చింది. రెండో నిందితుడు బిషప్ హ్యారి సెబాస్టియన్, నాలుగో నిందితుడు మత్తయ్య ఇరవై సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని, అనేక ఆధారాలు ఉన్నప్పటికీ ప్రాథమిక దశలోనే మత్తయ్యపై ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకాగురుస్వామి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. క్రైం సీన్‌లో మత్తయ్య లేరని, ఆయన్ను ఇరికించారని, ఎఫ్‌ఐఆర్‌లో అసంభవమైన ఆరోపణలు చేశారని డిఫెన్స్ న్యాయవాది ప్రియాంక ప్రకాశ్ వాదించారు. మత్తయ్య వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
రేవంత్, సండ్రల పిటిషన్లపై విచారణ 14కు వాయిదా
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం అక్టోబరు 14కు వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియామావళి కింద విచారణ చేపట్టాలని 22 జూలై 2021లో రేవంత్ రెడ్డి, ఈ కేసులో తన పేరును తొలగించాలని 13 ఏప్రిల్ 2021లో సండ్ర వెంకట వీరయ్య సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. రెండు పిటిషన్లను కలిపి శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారించింది. సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం కలుగజేసుకుని ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరారు. రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలని ఇదే ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని, సుప్రీంకోర్టు కొట్టేసిందని, తిరిగి ఆయనే మరోసారి ఇంప్లీడ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రస్తావించారు. ఉదయమే ఇదే కేసులో మత్తయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. దాంతో ఆ తీర్పు కాపీ వివరాలను తమకు అందించాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 14కు ధర్మాసనం వాయిదా వేసింది.