Share News

Telangana Police Recruitment: పోలీస్‌ నియామకాలపై హైకోర్టుకే వెళ్లండి

ABN , Publish Date - Sep 24 , 2025 | 04:16 AM

తెలంగాణలో పోలీస్‌ నియామకాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది...

Telangana Police Recruitment: పోలీస్‌ నియామకాలపై హైకోర్టుకే వెళ్లండి

  • న్యాయ విచారణ ఆ కోర్టు పరిధిలోనే ఉంటుంది

  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. అభ్యర్థుల పిటిషన్‌ డిస్మిస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పోలీస్‌ నియామకాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించినందన న్యాయ విచారణ ఆ కోర్టు పరిధిలోనే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు వ్యతిరేకంగా కొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. 15,644 కానిస్టేబుల్‌ పోస్టుల నియామకానికి సంబంధించి 2023 ఏప్రిల్‌ 30న పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు రాత పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో 12 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. వీటికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే స్వతంత్ర నిపుణుల కమిటీకి సమగ్ర నివేదిక సమర్పించాలని గతేడాది జనవరిలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఆ నివేదికను కమిటీ నాలుగు వారాల్లో పరిశీలించి రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సిఫారసు చేయాలని పేర్కొంది. నియామక పక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును రిక్రూట్‌మెంట్‌ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రక్రియ పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది. ఈ మేరకు ప్రక్రియను పూర్తి చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. కొందరు అభ్యర్థులు పోలీస్‌ ఉద్యోగాలకు ఎంపిక కాలేదంటూ వారికి సమాచారం ఇచ్చింది. అయితే, కమిటీ నివేదికను తమకు ఇవ్వలేదని, కనీసం ఎందుకు ఎంపిక చేయలేదో కూడా చెప్పలేదని పేర్కొంటూ జి.సాయిప్రసాద్‌, జి.మనీష సహా ఐదుగురు అభ్యర్థులు గత ఆగస్టు 1న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిక్రూట్మెంట్‌ బోర్డు సైతం మిస్‌లీనియస్‌ అప్లికేషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను కలిపి మంగళవారం జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది. గత కోర్టు ఆదేశాలను అమలు చేశామని, నియామక ప్రక్రియ పూర్తయిందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. ఇరువాదనల అనంతరం.. న్యాయవిచారణ హైకోర్టు పరిధిలోనే ఉంటుందని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇందులో ఇతర మరే అభ్యంతరాలు ఉన్నా హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.

Updated Date - Sep 24 , 2025 | 04:16 AM