Supreme Court: మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే!
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:36 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలోనూ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిళ్లకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలోనూ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పొందుపర్చాలని తెలిపింది. గత ఉత్తర్వులనే సవరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని బార్ కౌన్సిళ్లలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ న్యాయవాది ఎం.జీ.యోగమాయ 2024, ఆగస్టు 26న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఇదే అంశంపై మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై సుదీర్ఘ వాదనల అనంతరం ఈ నెల 8న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ‘‘ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం సీట్లు కేటాయించాలి. ఈ ఏడాదికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగినంత మంది లేకపోతే 20 శాతం సీట్లు వారికి కేటాయించాలి. మరో 10 శాతం సీట్లకు పోటీ చేయని వారినైనా నియమించుకోవాలి’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తమ ముందు ఉంచాలని భారత బార్ కౌన్సిల్(బీసీఐ)ని ఆదేశించింది. కాగా, ఆరు రాష్ట్రాల్లో బార్ కౌన్సిళ్లకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని బీసీఐ చైర్‌పర్సన్.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగైతే ఇప్పటికే బార్ కౌన్సిళ్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్, పంజాబ్-హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లో పోటీలో ఉన్న మహిళా న్యాయవాదుల విజయానికి కృషి చేయాలని ధర్మాసనం సూచించింది.
రెండు రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలి..
ఏపీ, తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనందున ఆ రెండు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలోనూ మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ నెల 9న తోట సునీత సహా మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనమే విచారించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానందున మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. తెలంగాణలో నోటిఫికేషన్ తేదీ ఎప్పుడని సీజేఐ ప్రశ్నించగా.. శుక్రవారం వస్తుందని న్యాయవాది చెప్పారు. ‘తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి ఇబ్బందీ ఉండకూడదు’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. తెలంగాణ బార్ కౌన్సిల్‌లో 30ు రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించారు. ఇవే ఉత్తర్వులు ఏపీ బార్ కౌన్సిల్‌కూ వర్తిస్తాయన్నారు. తమ గత ఉత్తర్వులను సవరిస్తున్నట్లు ధర్మాసనంస్పష్టం చేసింది. న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ పాలక మండళ్లలో వారి ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.