Supreme Court Direct: హైకోర్టులోనే తేల్చుకోండి!
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:23 AM
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు...
బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా?
ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు?
పిటిషనర్‌కు సరైన సలహా ఇవ్వాలి కదా?.. న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
జీవో 9ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ పరిధి మేరకు హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను 25 నుంచి 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరులో జీవో 9 తీసుకొచ్చింది. ఆ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ వంగా గోపాల్‌రెడ్డి ఈ నెల 4న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చింది. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 67 శాతానికి చేరతాయి. ఇది రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018లోని ‘సెక్షన్ 285ఏ’కు విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 243డీ, 243టీ కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సహా అనేక రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించడమే. గతంలో మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్‌లు 50ు పరిమితిని అధిగమించడానికి చేసిన ప్రయత్నాలను కోర్టులు కొట్టివేశాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని జీవో 9పై స్టే విధించండి’’ అని గోపాల్‌రెడ్డి కోరారు. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. రాష్ట్ర సర్కారు తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే, ఏడీఎన్ రావు హాజరయ్యారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు.
జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పందిస్తూ.. ‘హైకోర్టు స్టే ఇవ్వకపోతే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వస్తారా? అసలు 32 ప్రకారం పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు’ అని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ.. దసరా సెలవులకు ముందు, హైకోర్టు చివరి పని దినం ముగిసిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చిందని చెప్పారు. సెప్టెంబరు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కొంతమంది పిటిషనర్లు సెప్టెంబరు 28న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. స్టే ఇవ్వడానికి నిరాకరించిందని వివరించారు. ఆ పిటిషన్లపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉందన్నారు. అంటే, హైకోర్టు స్టే ఇవ్వకపోతే, సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని జస్టిస్ విక్రమ్‌నాథ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని, అందుకే అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని జస్టిస్ విక్రమ్‌నాథ్ చెప్పగా.. ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించాలని న్యాయవాది అభ్యర్థించారు. ‘మీ కక్షిదారుకు అవగాహన ఉండకపోవచ్చు. కనీసం మీరైనా చెప్పాలి కదా? విచారణ పరిధి హైకోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోండి’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది.