Share News

Supreme Court Decline: సర్కారీ ప్లీడర్ల తొలగింపులో జోక్యం చేసుకోం

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:52 AM

తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లా న్యాయస్థానాల్లో నియమించిన గవర్నమెంట్‌ ప్లీడర్లు, స్పెషల్‌, అసిస్టెంట్‌, అడిషనల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్లును కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించడం...

Supreme Court Decline: సర్కారీ ప్లీడర్ల తొలగింపులో జోక్యం చేసుకోం

  • బీఆర్‌ఎస్‌ హయాంలో నియమించిన ప్రభుత్వ ప్లీడర్లను తొలగించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లా న్యాయస్థానాల్లో నియమించిన గవర్నమెంట్‌ ప్లీడర్లు, స్పెషల్‌, అసిస్టెంట్‌, అడిషనల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్లును కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించడంపైతాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి, న్యాయవాదులకు మధ్య సంబంధం ’నమ్మకం‘ మీద ఆధారపడి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలను మాత్రం రెండునెలల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లా న్యాయస్థానాల్లో ప్రభుత్వ ప్లీడర్ల నియామకాలు నిబంధనల ప్రకారం జరగలేదని పేర్కొంటూ.. వారిలో కొంతమందిని కాంగ్రెస్‌ సర్కారు తొలగించిన సంగతి తెలిసిందే. సర్కారు నిర్ణయాన్ని వారిలో కొందరు హైకోర్టులో సవాల్‌ చేశారు. తమను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మారడం వల్ల వ్యవస్థలు లేదా సంస్థల స్వభావం మారదని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమను తొలగించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. ప్రభుత్వాలు తమకు నచ్చినవారిని ప్లీడర్లుగా నియమించుకునే స్వేచ్ఛ ఉంటుందని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఈ అంశంలో కలగజేసుకోవడం అంటే.. పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలకు సంకెళ్లు వేయడమేనని అభిప్రాయపడింది. జీవోఎంఎస్‌ నం.187లోని 9వ నిబంధన ప్రకారం ప్రభుత్వ ప్లీడర్లను నెల రోజుల నోటీస్‌ పీరియడ్‌ లేదా నెలరోజుల గౌరవ వేతనంతో తొలగించవచ్చని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీనిపై వారు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా.. సింగిల్‌ బెంచ్‌ తీర్పునే డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును యాండాల ప్రదీప్‌ సహా 19 మంది ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలూ విన్న ధర్మాసనం..ఈ విషయంలో కలుగజేసుకోలేమని చెబుతూ కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి.. ప్రభుత్వ న్యాయవాదులకు మధ్య నమ్మకం ఎంతో ముఖ్యమని.. గత ప్రభుత్వంలో నియమితులైన ప్లీడర్లపై ప్రస్తుత ప్రభుత్వానికి నమ్మకం లేకుంటే.. ముఖ్యమైన, సున్నితమైన కేసులను ఎలా అప్పగిస్తుందని ప్రశ్నించింది. కాగా.. సర్కారు తొలగించిన ప్లీడర్లు వారికి రావాల్సిన గౌరవ వేతనంపై ఆధారపడి జీవిస్తున్నారని, బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం.. పిటిషనర్లు తమకు రావాల్సిన బకాయిల వివరాలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని కలెక్టర్లకు సమర్పించాలని సూచించింది. వినతిపత్రం అందిన రెండునెలల్లోగా ప్రభుత్వం వారికి పూర్తి బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - Sep 16 , 2025 | 05:53 AM