Supreme Court: నిఠారీ వరుస హత్యల కేసులోసురేందర్ కోలీ నిర్దోషి
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:17 AM
దాదాపు రెండు దశాబ్దాల క్రితం దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది....
వేరే కేసులు లేకపోతే విడుదల చేయండి
రెండుదశాబ్దాల నాటి కేసులో సుప్రీం తీర్పు
నోయిడాలో ఎనిమిది మంది పిల్లల పుర్రెలు
బయటపడటంతో అప్పట్లో పెను కలవరం
కోలీకి విధించిన జరిమానాను కూడా రద్దుచేసిన కోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 11: దాదాపు రెండు దశాబ్దాల క్రితం దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ హత్యలకు సంబంధించి సురేందర్ కోలీపై పలు కేసులు నమోదుకాగా, అందులో ఒకదానిలో కోర్టు మంగళవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. తక్కిన కేసుల్లో ఇప్పటికే ఆయన నిర్దోషిగా తేలారు. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులోనే ప్రస్తుతం కోలీ జైలులో ఉన్నారు. తనకు ఈ కేసులో విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేయాలంటూ కోలీ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం, ఆ పిటిషన్‌ను అనుమతించడంతో ఆయన విడుదలకు దారి సుగమం అయింది. నోయిడాలోని నిఠారీ ప్రాంతంలో 2006 డిసెంబరు 29వ తేదీన వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంఢేర్ నివాసం వెనుక మురికి కాల్వలో ఎనిమిది మంది పిల్లల పుర్రెలు బయటపడటం అప్పట్లో పెను కలకలం రేపింది. పంఢేర్‌తోపాటు ఆయన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న సురేందర్ కోలీని ఈ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా తేలి పంఢేర్ విడుదల కాగా, 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు తప్ప తక్కిన అన్ని కేసుల్లో కోలీని కోర్టులు నిర్దోషిగా ప్రకటించాయి. ఈ కేసులో ఆయనకు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో యావజ్జీవ శిక్షగా మార్చింది. దీనికి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు సంస్థ, బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. వీరంతా కలిపి 14 పిటిషన్లు వేయగా, కోలీ క్యూరేటివ్ పిటిషన్ వేశారు. ఆ 14 పిటిషన్లను ఈ ఏడాది జూలై 30వ తేదీన కొట్టివేసిన సుప్రీంకోర్టు.. కోలీ వేసిన క్యూరేటివ్ పిటిషన్‌కు ఉన్న విచారణార్హతపై పరిశీలన కోసం దానిని అప్పటికి పెండింగ్‌లో ఉంచింది. ఇతర అన్ని కేసుల్లో కోలీ నిర్దోషిగా తేలడాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, చివరకు ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కేవలం ఒక కత్తి, వాంగ్మూలం ఆధారంగా కోలీని దోషిగా నిర్ధారించారని, నేర నిర్ధారణకు అవసరమైన సరైన సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారులు సంపాదించలేకపోయారని గుర్తించింది. దీంతో వేరే కేసులు లేక విచారణ పెండింగ్‌లో లేకపోతే సురేందర్ కోలీని వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఆయనకు విధించిన శిక్షతోపాటు జరిమానాను కూడా రద్దు చేసింది.